
రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి.
సాక్షి, కాకినాడ: రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ..
‘‘ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరా. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్సార్‌సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే.. బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను..
.. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరు?. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు?. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు.
.. ‘‘సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. మీరేంటీ పొడుగు?.. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు. నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది?’’.. అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు.
.. ‘వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం’ అంటూ ముద్రగడ ప్రకటించారు.