
నిర్లక్ష్యపు నిప్పు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చిన్నపాటి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు దారితీస్తోంది.. విలువైన ఆస్తులే కాదు.. ప్రాణాలను సైతం హరిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుగు చూసిన అగ్నిప్రమాదాలను పరిశీలిస్తే మెజార్టీ ప్రమాదాలు కాల్చిన సిగరెట్, బీడీ ముక్కలతోనే జరిగినట్లు తేలింది. ఆ తర్వాతి స్థానంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లు, మెకానిక్ హీట్స్, గ్యాసు లీకేజీలు ఉన్నాయి. 2014 నుంచి 2025 వరకు 2,657 అగ్ని ప్రమాదాలు వెలుగు చూశాయి. వీటిలో స్మోకింగ్ కారణంగా 968, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా 924, మెకానికల్ హీట్ కారణంగా 172, గ్యాసు లీకేజీ కారణంగా 94 ప్రమదాలు చోటు చేసుకున్నట్లు తేలింది. కొంత మంది అలవాటుగా, మరికొంత మంది ఫ్యాషన్ కోసం సిగరెట్ కాలుస్తున్నారు. స్మోకింగ్ తర్వాత కాలుతున్న ఆయా సిగరెట్/బీడీ ముక్కలను బహిరంగ ప్రదేశాలు, చెత్తకుండీల్లో విసిరేస్తున్నారు. పక్కనే ఉన్న పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, ఎండుగడ్డి, ఇతర పదార్థాలకు అంటుకుని మంటలు వ్యా పిస్తున్నాయి.
మాదాపూర్‌లోనే అత్యధికం
హోటళ్లలో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య సముదాయాల్లో నాసిరకం వైరింగ్, లూజ్ కాంటాక్ట్‌లతో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లు వెలుగు చూస్తున్నాయి. ఇళ్ల మధ్య వెలసిన ప్లాస్టిక్ గోదాములను కాల్చిపడేసిన సిగరెట్, బీడీ ముక్కలు బుగ్గి చేస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాల్లో మండే రసాయనాలను నిల్వ ఉంచడం ద్వారా గృహ సముదాయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆస్పత్రులు, ఇతర వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకున్నా.. నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. విలువైన ఆస్తులతో పాటు ప్రాణాలు పోతున్నాయి. ఏటా ప్రచారం కల్పిస్తున్నా ప్రమాదాలు తగ్గకపోగా, మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు అధికంగా ఉన్న మాదాపూర్‌లోనే ఎక్కువ ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజేంద్రనగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లా పరిధిలో తొమ్మిది అగ్నిమాపక కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని విపత్తులు, అగ్ని ప్రమాదాల నియంత్రణ శాఖ పలు సూచనలు చేసింది.
మాదాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం (ఫైల్)
న్యూస్‌రీల్
హోటల్స్‌లో పాటించాల్సినవి
పై అంతస్తుల్లోని డోర్లు, మెట్లకు ఎలాంటి వస్తువులు అడ్డుపెట్టరాదు.
ప్రధాన ద్వారాలకు ఎదురుగా అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ‘ఎస్కేప్ ప్లాన్’ ఉంచాలి.
ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా ‘డ్యాంపర్స్’ను ఏర్పాటు చేసి, ఆటోమెటిక్ డిటెక్షన్ సిస్టంకు అనుసంధానించాలి.
విద్యుత్ వైరింగ్, ఉపకరణాలు, స్విచ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడంతో పాటు లోపాలను సరిదిద్దుకోవాలి.
తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి, అత్యవసర సమయాల్లో ఏ విధంగా అనుసరించాలో వివరించాలి.
వంట గదుల్లోని ఎల్‌పీజీ సిలిండర్ నిల్వ చేసే ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
బేస్‌మెంట్‌ను కేవలం పార్కింగ్ కోసమే వాడాలి. మండే పదార్థాలు, ఆయిల్స్ నిల్వ చేయరాదు.
షార్ట్‌సర్క్యూట్‌లు జరగకుండా..
బీఎస్‌ఐ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలు మాత్రమే వాడాలి.
క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌తోనే పనులు చేయించాలి.
వైరింగ్‌లో జాయింట్స్, లూజు కాంటాక్ట్‌లు లేకుండా చూసుకోవాలి. ప్లగ్ లేని వైర్ చివరను సాకెట్‌లో ఉంచాలి.
రిఫ్రిజిరేటర్, ఓవెన్‌లను ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాల్లోనే ఉంచాలి. కిచెన్‌లో ఉంచరాదు.
కార్పెట్లు, చాపల కింద ఎలక్ట్రిక్ వైర్లు లాగొద్దు. వాటిని తొక్కడం ద్వారా షార్ట్‌సర్క్యూట్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల నివారణ కోసం సరైన ఎర్తింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి.
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను బెడ్ వద్ద చార్జింగ్ పెట్టరాదు.
విద్యుత్ పరికరాలకు నిప్పంటుకుంటే వాటిని నీటితో ఆర్పే ప్రయత్నం చేయొద్దు. స్విచ్ఛాఫ్ చేయడం, పొడి ఇసుక, కార్బన్‌డై ఆకై ్సడ్‌తో మంటను ఆర్పేయాలి.
విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తికి అధిక మోతాదులో నీళ్లు ఇవ్వాలి. స్విచ్‌రూమ్‌లో చెత్త వేయకూడదు.
ఆస్పత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్లోర్లను ఫైర్ కంపార్టుమెంట్స్‌గా విభజించి, అగ్ని ప్రమాదాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అత్యవసర ద్వారాలు, ఫైర్ డోర్లకు లాక్ చేయకూడదు.
బయటికి వెళ్లే మార్గాల ‘ఎవాక్యూయేషన్ ప్లాన్’ను ప్రతి అంతస్తులో అందరికీ కన్పించేలా ఏర్పాటు చేయాలి.
ప్రతి ఐదేళ్లకోసారి విద్యుత్ వైరింగ్, ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను లైసెన్స్‌డ్ ఎలక్ట్రీషియన్‌తో పరీక్ష చేయించుకోవాలి.
అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు లిఫ్ట్‌లు వాడొద్దు.
అత్యవసర ద్వారాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి.
బ్యాటరీ బ్యాకప్‌తో కనిసం 20 నిమిషాలు పని చేసేలా ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి.
ఫైర్ అలారం మోగిన వెంటనే భవనం ఖాళీ చేయాలి. అగ్ని ప్రమాదాలపై 101కు సమాచారం ఇవ్వాలి.
ఏటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
జిల్లాలో గత ఏడాది 1,390 ఘటనలు
బుగ్గి చేస్తున్న సిగరెట్, బీడీ ముక్కలు
కారణమవుతున్న విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లు
ఆందోళన కలిగిస్తున్న ఆస్తి, ప్రాణనష్టాలు
అప్రమత్తంగా ఉండాలంటున్న అగ్నిమాపక శాఖ
గత ఏడాది జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదాలు
ఫైర్‌స్టేషన్ అగ్ని ప్రమాదాలు
మాదాపూర్ 316
హయత్‌నగర్ 178
రాజేంద్రనగర్ 173
ఎల్బీనగర్ 161
వట్టినాగులపల్లి 147
చేవెళ్ల 130
ఇబ్రహీంపట్నం 106
షాద్‌నగర్ 104
మహేశ్వరం 75

నిర్లక్ష్యపు నిప్పు!