
‘నారింజ’కు జలకళ
● వేసవిలోను నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు ● పెరిగిన భూగర్భజలాలు
జహీరాబాద్ టౌన్: వేసవికాలం ప్రారంభమైనప్పటికీ జహీరాబాద్ ప్రాంతంలోని నారింజ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోరు బావులు నిండుగా నీరు పోస్తున్నాయి. బోరు బావుల కింద ఉన్న పంటలు పచ్చగా కనిపిస్తున్నాయి. శాశ్వత నీటి వనరులు లేనందున ఈ ప్రాంత రైతులు బోరు బావులపై ఆధారపడి పంటల పండిస్తున్నారు. చెరువులు లేనందున వేల రుపాయలు ఖర్చు చేసి బోరు తవ్వించి పంటలు పండిస్తుంటున్నారు. అయితే అనావృష్టి వల్ల 500 అడుగుల లోతు ఉన్న బోర్లలో కూడా నీరు ఇంకిపోయే పరిస్థితులు ఉండేవి. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. వేసవిలోనూ రైతులు హాయిగా పంటలు పండించుకుంటున్నారు.
కాలువలు దెబ్బతినడంతో..
పంటల సాగు కోసం నిర్మించిన నారింజ ప్రాజెక్టు పలు కారణాల వల్ల ఊట చెరువుగా మారింది. ప్రాజెక్టు ఎడుమ, కుడి కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో గేట్లు మూసి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని నిలువ ఉంచడం ప్రారంభించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నారింజ ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడంతో లీకేజీతో నీరు ఖాళీ అయ్యేది. ప్రాజెక్టులోని నీరంతా వృథాగా కర్ణాటకకు తరలిపోయేది. దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతూ వస్తున్నారు. అప్పటి కలెక్టర్ హన్మంత్‌రావు స్పందించి ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించి పేరుకుపోయిన పూడిక మట్టిని తీయించారు. అప్పటి నుంచి గేట్ల నుంచి లికేజీలు బంద్ అయ్యాయి. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులో నీరు చేరి జలకళ సంతరించుకుంది. భూగర్భ జలాలు పెరిగి కొత్తూర్(బి), మల్కాపూర్, బూచినెల్లి, బుర్దిపాడ్, సత్వార్, రేజింతల్, అల్గోల్, మిర్జాపూర్(బి) తదితర గ్రామాల పరిధిలోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. బోరు బావుల్లో నీరు ఉండటంతో వాణిజ్య పంటలైన చెర కు, అల్లం, కూరగాయాలను రైతులు పండిస్తున్నారు.