
వేర్వేరు కారణాలతో ఐదుగురు బలవన్మరణం
సిద్దిపేట, మెదక్ జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు కారణాలతో ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
కడుపునొప్పి తాళలేక యువకుడు
ములుగు(గజ్వేల్): ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన జమాల్పూర్ స్వామి(23) కడుపునొప్పి బాధను భరించలేక 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని బావమరిదికి వీడియో కాల్ చేసి చెప్పాడు. కుటుంబీకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వామి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ సభ్యులు మందలించారని వ్యక్తి
దుబ్బాకటౌన్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కాకల్ల యాదయ్య (59) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మొదటి భార్య సత్తవ్వ మృతి చెందడంతో 25 ఏళ్ల కిందట ఐలవ్వను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు కూతుర్లు, రెండో భార్యకి కుమారుడు ఉన్నాడు. యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఇలా తాగితే ఎలా అని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై యాదయ్య శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఐలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు.
అనారోగ్య సమస్యలతో వృద్ధుడు
చిన్నశంకరంపేట(మెదక్): అనారోగ్య సమస్యలతో వృద్ధుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం భీమ్‌రావుపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నార్సింగి మండలం భీమ్‌రావుపల్లి గ్రామానికి చెందిన కొంగల సిద్ధయ్య(60) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో సిద్ధయ్య బాధపడుతున్నాడు. భార్య నర్సమ్మ కూడా ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది సిద్ధయ్య గ్రామ శివారులోని కాల్వ గట్టు వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో ఎలక్ట్రీషియన్..
దుబ్బాక: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మోహన్(50) రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు, ఎలా భూమి లేదు. కుటుంబం గడవడానికి అప్పు లు చేశాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆలయంలో విధులకు హాజరై శుక్రవారం తెల్లవారుజామున ఆలయం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో యువకుడు
చిన్నకోడూరు(సిద్దిపేట): అప్పుల బాధతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిన్నకోడూరులో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ బాలకృష్ణ కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేపాక యాదవ్వ–రమేశ్ దంపతుల కుమారుడు రేపాక రోహిత్(22) ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఉపాధి కోసం తండ్రి హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రోహిత్, తల్లి, చెల్లితో చిన్నకోడూరులో ఉంటున్నాడు. అప్పుల వాళ్లు అడుగుతుండటంతో మనస్తాపం చెంది రోహిత్ గురువారం అర్థరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడి తల్లి యాదవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వేర్వేరు కారణాలతో ఐదుగురు బలవన్మరణం