
మహనీయుడా.. మన్నించు
– దాత పేరు లేదని విగ్రహావిష్కరణ వాయిదా
పాపన్నపేట(మెదక్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహ దాత తన పేరు పెట్టాలన్న డిమాండ్ ఆవిష్కరణకు బ్రేకులు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేటలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించాలని గ్రామంలోని మూడు యువజన సంఘాలు సంకల్పించాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దాత విగ్రహం వితరణ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ మేరకు యువజన సంఘాలు మండల కాంప్లెక్స్ సముదాయం ముందు సుమారు రూ.2 లక్ష లు ఖర్చు చేసి గద్దె నిర్మించారు. అనుకున్న ప్రకారం వారం రోజుల కిందట విగ్రహం వచ్చింది. ముసుగు వేసి గద్దైపె ఉంచారు. మంగళవారం ఓ ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించాలనుకున్నారు. విగ్రహం ప్రతిష్టించే గద్దైపె తన పేరు ఉండాలని దాత డిమాండ్ చేశాడు. యువజన సంఘాలు ఇందుకు ససేమీర అనడంతో విగ్రహాన్ని వెనక్కి తీసుకెళ్లారు. బోసిపోయిన గద్దెను చూసి మండల ప్రజలు అవాక్కయ్యారు.