
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జోన్: వేసవి కాలం ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...మూడు నెలల పాటుపంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి నీటి సమస్యను అధిగమించాలన్నారు. ప్రతీ పది రోజులకు ఒకసారి జిల్లాలోని తాగునీటి సరఫరాపై సమీక్ష జరిపి, అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.