
శుభకార్యంలో ఈదురు గాలుల బీభత్సం
● ఎగిరిపోయిన షామినాయా, టెంట్లు, ఇనుప రేకులు ● తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న బంధువులు
నారాయణఖేడ్: ఈదురు గాలుల బీభత్సం ఓ వివాహ శుభకార్యంలో కొద్దిసేపు బంధుమిత్రులను ఆందోళనకు గురిచేసింది. మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో ఓ మాలిపటేల్ కుమారుడి వివాహం గ్రామంలో నిర్వహించారు. ఇంటి ఆవరణలో టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. వివాహం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో అక్కడ వేసిన టెంట్లు, షామియానా, సమీపంలోని షెడ్డుపై రేకులు గాలిలోకి ఎగిరిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో బంధువులు, మిత్రులు వాటి కిందనుంచి బయటకు పరుగులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి సైతం టెంటు కింద చిక్కుకుపోగా ఇతరుల సహాయంతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. షెడ్డు రేకులు దూరంగా పడటంతో తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శుభకార్యంలో ఈదురు గాలుల బీభత్సం