
లాహోర్: వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’లో తాను పాల్గొనడం లేదని... పాకిస్తాన్‌కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ స్పష్టం చేశాడు. వచ్చే నెల 24న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మీట్ జరగనుండగా... అందులో పాల్గొనాల్సిందిగా నదీమ్‌కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆహ్వానించాడు. అయితే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు సిద్ధమవుతుండటంతో నీరజ్ ఆహ్వానాన్ని తిరిస్కరించినట్లు నదీమ్ బుధవారం వెల్లడించాడు.
నీరజ్ నుంచి ఆహ్వా నం రావడం చాలా గొప్పగా ఉందని అయితే అనుకోకుండా తాను పాల్గొనలేకపోతున్నానని అన్నాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ మే 24న జరగనుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో మెరుగైన సాధన కోసం నేను మే 22న కొరియా వెళ్తున్నా’ అని నదీమ్ వివరించాడు. మే 27 నుంచి 31 వరకు కొరియాలోని గుమీలో ఆసియా చాంపియన్‌షిప్ జరగనుంది. అంతకుముందు ఈ అంశంపై స్పందించిన నీరజ్ చోప్రా... ఈ టోర్నీలో పాల్గొనేందుకు నదీమ్‌కు ఆహ్వానం పంపినట్లు తెలిపాడు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం చేజిక్కించుకోగా... నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. భారత్ వేదికగా నిర్వహిస్తున్న తొలి జావెలిన్ మెగా ఈవెంట్‌లో అంతర్జాతీయ స్టార్లు అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), థామస్ రోలెర్ (జర్మనీ), జూలియస్ యెగో (కెన్యా), కర్టీస్ థాంప్సన్ (అమెరికా) పాల్గొంటున్నారు.
ఈ టోర్నీకి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ పంచ్‌కులాలో జరగాల్సినా... నిర్ణీత ప్రమాణాలతో కూడిన ఫ్లడ్‌లైట్లు లేకపోవడంతో వేదికను బెంగళూరుకు మార్చారు.