
ధోని (Photo Courtesy: BCCI/IPL.com)
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ రెండు పేర్లను విడివిడిగా చూడటం కష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై నిలవడానికి ప్రధాన కారణం ధోని. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలు మొదలు.. మైదానంలో అమలు చేసే ప్రణాళికల వరకు అంతా తానే!
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ దిగ్గజ కెప్టెన్.. గతేడాది సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొన్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను తన వారసుడిగా ఎంపిక చేశాడు. అయితే, మైదానంలో రుతుకు సూచనలు ఇస్తూ అతడికి దిశానిర్దేశం చేసే పాత్రలో ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
రెప్పపాటులో స్టంపౌట్
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని 43 ఏళ్ల వయసులోనూ.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలోనూ దిట్ట. ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి పోరులో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఔరా అనిపించాడు.
𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡
📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025
ఇక మిచెల్ సాంట్నర్ వికెట్‌కు సంబంధించి.. డీఆర్‌ఎస్ విషయంలోనూ రుతును సరైన సమయంలో అలర్ట్ చేసి.. జట్టుకు వికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సీఎస్‌కేను, ధోనిని వేరువేరుగా చూడలేము అనేది!
అలా అయితే.. నాతో నయాపైసా ఉపయోగం ఉండదు
అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒకవేళ తాను వికెట్ కీపర్‌గా బరిలోకి దిగకపోతే.. జట్టులో ఉండీ ఏమాత్రం ఉపయోగం లేదంటూ.. ఈ ఫైవ్‌టైమ్ చాంపియన్ అన్నాడు. జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ ఆటగాడిగా కొనసాగడం అతిపెద్ద సవాలు.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకవేళ నేను కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే.. మైదానంలో నేను ఉండీ నయాపైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. వికెట్ల వెనుక నుంచే నేను మ్యాచ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాను.
వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతా
బౌలర్ ఎలా బంతిని వేస్తున్నాడు? పిచ్ స్వభావం ఎలా ఉంది?.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి? వంటి విషయాలన్నీ ఆలోచించగలను. ముఖ్యంగా మొదటి ఆరు ఓవర్లలో కొత్త బంతి ఎలాంటి ప్రభావం చూపుతోందని గమనిస్తా.
ఆ తర్వాత పరిస్థితులు ఏవిధంగా మారుతున్నాయి? బౌలర్లను మార్చాలా? లేదంటే ప్రణాళికలు మార్చాలా? లాంటి అంశాల గురించి కెప్టెన్‌కు సరైన సందేశం ఇవ్వగలుగుతా. ఉత్తమ బంతికి బ్యాటర్ సిక్సర్ బాదాడా?
లేదంటే.. చెత్త బంతికి షాట్ కొట్టాడా? అన్నది వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతా’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. గతేడాది నుంచి వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
బౌలర్ల విజృంభణ
ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. సొంతమైదానం చెపాక్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రుతుసేన తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా ముంబైని 155 పరుగులకే కట్టడి చేసింది.
రచిన్, రుతు హాఫ్ సెంచరీలు
లక్ష్య ఛేదనలో ఓపెనర్ రచిన్ రవీంద్ర అర్ధ శతకం(45 బంతుల్లో 65 నాటౌట్)తో చెలరేగగా.. కెప్టెన్ రుతురాజ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 53)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన చెన్నై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది.
ముంబైని స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా.. అజేయంగా నిలిచాడు.