
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే రాణించాడు. తొలి మ్యాచ్‌లో రచిన్ సత్తా చాటడంతో సీఎస్‌కే ముంబైను ఓడించింది. ఆ మ్యాచ్‌లో రుతురాజ్ కూడా రాణించినా.. ఆర్సీబీతో మ్యాచ్‌లో డకౌటయ్యాడు. సీఎస్‌కే తరఫున రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా దిగిన రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు.
దీపక్ హుడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌లో త్రిపాఠి, హుడాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోకపోతే సీఎస్‌కే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరిని ఇలాగే కొనసాగిస్తే రాయల్స్ చేతిలో కూడా పరాభవం (ఆర్సీబీ చేతిలో ఓడింది) తప్పకపోవచ్చు.
ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతనిపై కూడా సీఎస్‌కే మేనేజ్‌మెంట్ దృష్టి సారించాలి. సామ్ బౌలర్‌గా కూడా విఫలమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ సీజన్‌లో అంతంతమాత్రంగానే ఉన్నాడు. బౌలర్‌గా పూర్తిగా విఫలమైన జడ్డూ బ్యాటింగ్‌లో మమ అనిపించాడు.
గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోయాడు. దూబే కూడా రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ ఆల్‌రౌండర్ నుంచి బ్యాటింగ్‌లో మెరుపులు ఆశించడం అత్యాశే అవుతుంది.
తొలి మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా ఓపెన్ చేయని ధోని.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి బ్యాట్ ఝులిపించాడు. ధోని ఇదే తరహా హిట్టింగ్‌ను మున్ముందు కూడా కొనసాగిస్తే సీఎస్‌కే మేలవుతుంది. ఇక మిగిలింది బౌలర్లు. వారి విభాగం వరకు వారు పర్వాలేదనిపించారు.
నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తూ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కని పతిరణ.. ఆర్సీబీతో మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్, జడ్డూ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వీరిద్దరి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి.
బెంచ్ కూడా బలహీనమే
ఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను తప్పిస్తే.. ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఒక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.
విదేశీ బ్యాటర్ డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది. మిగిలిన ఆటగాళ్లలో షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడి మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ లెక్కన చూస్తే.. వరుసగా విఫలమవుతున్నా త్రిపాఠి, హుడాలలో ఒకరిని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్‌కేలా బ్యాటింగ్ వనరుల కొరత ఈ సీజన్‌లో ఏ ఫ్రాంచైజీకి లేదు. ఈ జట్టుతో సీఎస్‌కే ఆరోసారి టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది.
సీఎస్‌కే పూర్తి జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్‌కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి