
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా తొలి టెస్టు గెలిచి టీమిండియా జోరు మీదుండగా... ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ‘పింక్ బాల్’ టెస్టు ప్రారంభం కానుంది.
ఇకపై వారికి అనుమతి లేదు
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు గులాబీ బంతితో ముమ్మర సాధన చేస్తుండగా... ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరైన కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లను ఎగతాళి చేశారు.
ఈ నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో ఇకపై భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించబోవడం లేదు. కాగా మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా... వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.
పరుష పదజాలంతో దూషణలు
అడిలైడ్ మైదానంలో నెట్స్‌కు చాలా సమీపం వరకు అభిమానులు వచ్చే వీలుండటంతో... అక్కడికి చేరుకున్న పలువురు పరుష పదజాలంతో భారత ఆటగాళ్లను తూలనాడారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఫిర్యాదు చేసింది. ఇకపై టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌కు అభిమానులను అనుమతించబోమని తేల్చి చెప్పింది.
చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు