‘పింక్ బాల్’తో మ్యాచ్ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది.
అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్‌తో ఆడారు.
ఇక కేఎల్ రాహుల్‌కు ఇదే తొలి ‘పింక్ బాల్ టెస్టు’ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్ నైట్ టెస్టులో ‘పింక్ బాల్’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్ వ్యాఖ్యానించాడు.
నాకు ఇది కొత్త అనుభవం
‘బౌలర్ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
స్వింగ్ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్‌లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ చెప్పాడు.
అయితే ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్ రాహుల్ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు.
అప్పుడే సరైన షాట్ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పింక్ బాల్ టెస్టుకు వేదికైన అడిలైడ్ చేరుకున్న టీమ్ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది.
ఓపెనర్‌గా ఆడిస్తారా?
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్‌గా కొనసాగాలా లేక మిడిలార్డర్‌లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్ స్పందించాడు.
బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్ టెస్టులో నా బ్యాటింగ్ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను.
ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్ ఆడాలా లేక అటాక్ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్‌ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్ అయినా మిడిలార్డర్ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్ వెల్లడించాడు.
ముందే చెప్పారు
ఇక టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్ ఇదే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
ఈ పదేళ్ల కెరీర్‌లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్‌ను ఆస్వాదించాననేది వాస్తవం.
వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా
చిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు.
కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ వివరించాడు.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే!
Comments
Please login to add a commentAdd a comment