
కావ్యా మారన్ (Photo Courtesy: BCCI/IPL.com)
గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమిన్స్ (Pat Cummins)కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం.. రెండోది ఆస్ట్రేలియాకే చెందిన ఓపెనర్, టీమిండియాకు ‘తలనొప్పి’ తెప్పించే ట్రావిస్ హెడ్ (Travis Head)ని అభిషేక్ శర్మకి జతగా ఓపెనింగ్‌కి పంపాలని నిర్ణయించడం. ఈ రెండు నిర్ణయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్నే మార్చేశాయి.
పవర్ ప్లే అంటే ప్రత్యర్థికి దడే
అంతవరకూ ఎప్పుడూ విజయం కోసం ఎదురు చూసిన జట్టు.. ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లలో, ముఖ్యంగా పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ద్వయం ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రిథమ్‌ని దెబ్బతీశారు.
ఫలితంగా పరుగుల వెల్లువ ప్రవహించింది. వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది. గత సంవత్సరం ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువగా రావడంలో బ్యాటర్లదే కీలక పాత్ర.
సన్‌రైజర్స్ ఫార్ములాకి అప్‌గ్రేడ్ కిషన్
ఇంత అద్భుత ఫలితాల్నిచ్చిన ఫార్ములాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుఉంటుందా? అందుకే అదే ఫార్ములాను అప్‌గ్రేడ్ చేసింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఇషాన్ కిషన్ ని మునుపటి నంబర్ 3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానం లో తీసుకొచ్చింది. ఈ నేపధ్యం లో సొంతగడ్డ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది.
ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్‌రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది. ఎందుకంటే అలాంటి ఊపు మీదున్న సన్‌రైజర్స్ బ్యాట్స్మన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించడం రాయల్స్ చేసిన పెద్ద తప్పిదనం. ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది.
రాయల్స్ కొంపముంచిన టాస్
రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్ల పై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు.
గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ 47 బంతుల్లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లుతో అజేయంగా నిలిచి 106 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ లో ఇది మొదటి సెంచరీ. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది. గత సంవత్సరం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 287 పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనుక పడింది.
చివరి వరకూ పోరాడిన రాయల్స్
ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే నిజానికి రాయల్స్ చివరి వరకూ పోరాడింది. ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్‌ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు సామ్సన్, మరియు ధ్రువ్ జురెల్ రాయల్స్‌ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు.
నాల్గవ వికెట్‌కు వారిద్దరు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సామ్సన్ 66 పరుగులు చేయగా, జురెల్ 70 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్మైర్, శుభం దూబే వచ్చి స్కోర్ ని పరుగు పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది. హెట్మైర్ 44 పరుగులు సాధించగా దూబే 32 పరుగులు చేయడంతో రాయల్స్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 242 కి చేరింది.
కావ్యా మారన్ కళ్లలో ఆనందం
ఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ 44 పరుగుల తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్ లకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచిదనడంలో సందేహంలేదు.
ఇక క్లాసెన్, ఇషాన్ కిషన్ ప్ర్యతర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ పలికించిన హావభావాలు, భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు.
చదవండి: మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్
An epic run-fest goes the way of @SunRisers 🧡
The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏
Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025