IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ | IPL 2025: SRH Replaces Injured Brydon Carse With SA Wiaan Mulder, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌.. ప్రకటించిన ఫ్రాంఛైజీ

Published Thu, Mar 6 2025 3:58 PM | Last Updated on Thu, Mar 6 2025 5:31 PM

IPL 2025: SRH Replaces Injured Brydon Carse with SA Wiaan Mulder

బ్రైడన్‌ కార్సే (PC: SRH)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్టులోకి కొత్త క్రికెటర్‌ వచ్చాడు. సౌతాఫ్రికాకు చెందిన వియాన్‌ ముల్దర్‌(Wiaan Muldar)కు రైజర్స్‌ స్వాగతం పలికింది. ఈ ప్రొటిస్‌ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి చేర్చుకున్నట్లు హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా దూరమైన బ్రైడన్‌ కార్సే స్థానాన్ని ముల్దర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్‌ ఐదుగురు ప్లేయర్లను రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా స్టార్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌(రూ. 23 కోట్లు), ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(రూ. 18 కోట్లు), టీమిండియా స్టార్లు అభిషేక్‌ శర్మ(రూ. 14 కోట్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(రూ. 6 కోట్లు ), ఆసీస్‌ హార్డ్‌ హిట్టర్‌ ట్రావిస్‌ హెడ్‌(రూ. 14 కోట్లు)లను రైజర్స్‌ యాజమాన్యం అట్టిపెట్టుకుంది.

ఈ ‍క్రమంలో రూ. 45 కోట్ల పర్సు వాల్యూతో ఐపీఎల్‌-2025 మెగా వేలం బరిలో దిగిన సన్‌రైజర్స్‌.. ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, రాహుల్‌ చహర్‌ వంటి భారత స్టార్లతో పాటు ఆడం జంపా, బ్రైడన్‌ కార్సే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ రూపంలో విదేశీ క్రికెటర్లను కూడా కొనుగోలు చేసింది.

బొటనవేలికి గాయం.. సీజన్‌ మొత్తానికి  దూరం
అయితే, ఇంగ్లండ్‌ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ బ్రైడన్‌ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025‍ టోర్నమెంట్‌లో భాగంగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా.. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో రెహాన్‌ అహ్మద్‌ను తీసుకువచ్చింది.

ఇక ఐపీఎల్‌ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్‌ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్‌రైజర్స్‌ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్‌ ముల్దర్‌ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్‌రౌండర్‌ సన్‌రైజర్స్‌తో చేరనున్నాడు. 

ఆఖరిగా సెమీస్‌లో
కాగా 27 ఏళ్ల వియాన్‌ ముల్దర్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతం వాటం బ్యాటర్‌ అయిన అతడు.. రైటార్మ్‌ మీడియం పేసర్‌. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఆడిన ఈ ప్రొటిస్‌ ప్లేయర్‌ చివరగా న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేన్‌ విలియమ్సన్‌(102) రూపంలో కీలక వికెట్‌ తీసినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ముల్దర్‌ కేవలం ఎనిమిది పరుగులే చేసి.. మైకైల్‌ బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ముల్దర్‌ ఇప్పటి వరకు 18 టెస్టులు, 24 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. 

ఆయా ఫార్మాట్లలో వరుసగా 589, 268, 105 పరుగులు చేయడంతో పాటు... 30, 21, 8 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌ గతేడాది కమిన్స్‌ కెప్టెన్సీలో ఫైనల్‌ చేరింది.. కానీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు టైటిల్‌ను చేజార్చుకుంది.

ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు
హెన్రిచ్‌ క్లాసెన్‌, ప్యాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చహర్‌, అభినవ్‌ మనోహర్‌, ఆడం జంపా., సిమర్‌జీత్‌ సింగ్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌ కార్సే, జయదేవ్‌ ఉనాద్కట్‌, కమిందు మెండిస్‌, జీషాన్‌ అన్సారీ, అనికేత్‌ వర్మ, అథర్వ టైడే.

చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం.. మరోసారి: సాంట్నర్‌ వార్నింగ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement