ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్‌ను ఎంత పొగిడినా తక్కువే: స్టార్క్‌ | Mitchell Starc Comments After Team India Champions Trophy 2025 Victory | Sakshi
Sakshi News home page

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్‌ను ఎంత పొగిడినా తక్కువే: మిచెల్‌ స్టార్క్‌

Published Thu, Mar 13 2025 12:20 PM | Last Updated on Thu, Mar 13 2025 1:18 PM

Mitchell Starc Comments After Team India Champions Trophy 2025 Victory

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజయానంతరం టీమిండియాపై ఆసీస్‌ స్పీడ్‌గన్‌ మిచెల్‌ స్టార్క్‌ ప్రశంసల వర్షం​ కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్‌ను, టీమిండియా కీలక సభ్యుడు కేఎల్‌ రాహుల్‌ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం భారత్‌ ఒక్కటే ఒకే రోజు మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని అన్నాడు. 

టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాపై.. వన్డేల్లో ఇంగ్లండ్‌పై.. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించినా భారత జట్లు గట్టి పోటీ ఇవ్వగలవని కితాబునిచ్చాడు. భారత్‌ మినహా ప్రపంచ క్రికెట్‌లో ఏ దేశానికి ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించే సత్తా లేదని కొనియాడాడు.

కేఎల్‌ రాహుల్‌ను ఆకాశానికెత్తిన స్టార్క్‌
మిచెల్‌ స్టార్క్‌ టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రాహుల్‌ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్‌ మిస్టర్‌ ఫి​క్సిట్‌ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైన చేయగలడని కొనియాడాడు. 

ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో, ఆరో స్థానంలో, వికెట్‌ కీపింగ్‌ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా.. ఇలా ఏ పాత్రలో అయినా రాహుల్‌ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రాహుల్‌ తన ఐదో స్థానాన్ని అక్షర్‌ పటేల్‌కు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేశాడని అన్నాడు. 

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా గెలుపుకు రాహుల్‌ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్‌ లాంటి మల్టీ టాలెంటెడ్‌ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మిచెల్‌ స్టార్క్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. స్టార్క్‌ను గతేడాది మెగా వేలంలో ఢిల్లీ రూ. 11.75 కోట్లు సొంతం చేసుకుంది. 

అంతకుముందు ఏడాది (2024) స్టార్క్‌ కేకేఆర్‌కు ఆడాడు. ఆ సీజన్‌ వేలంలో కేకేఆర్‌ స్టార్క్‌కు రికార్డు ధర (రూ. 24.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది మూడో అ‍త్యధిక ధర. ఐపీఎల్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడి రికార్డు రిషబ్‌ పంత్‌ పేరిట ఉంది. పంత్‌ను ఈ సీజన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 27 కోట్లు చెల్లించి సొంతం​ చేసుకుంది. ఇదే సీజన్‌ వేలంలో ఐపీఎల్‌లో రెండో అత్యధిక ధర కూడా నమోదైంది. పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు రూ. 26.75 కోట్లు చెల్లించింది.

ఐపీఎల్‌లో టాప్‌-5 పెయిడ్‌ ప్లేయర్స్‌
రిషబ్‌ పంత్‌- 27 కోట్లు (లక్నో, 2025)
శ్రేయస్‌ అయ్యర్‌- 26.75 కోట్లు (పంజాబ్‌, 2025)
మిచెల్‌ స్టార్క్‌- 24.75 కోట్లు (కేకేఆర్‌, 2024)
వెంకటేశ్‌ అయ్యర్‌- 23.75 కోట్లు (కేకేఆర్‌, 2025)
పాట్‌ కమిన్స్‌- 20.50 కోట్లు (సన్‌రైజర్స్‌, 2024)

2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..
ఫాఫ్‌ డుప్లెసిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, అషుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్‌, దర్శన్‌ నల్కండే, అజయ్‌ జాదవ్‌ మండల్‌, త్రిపురణ విజయ్‌, అక్షర్‌ పటేల్‌, మన్వంత్‌ కుమార్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్‌, డొనొవన్‌ ఫెరియెరా, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దుష్మంత చమీరా, మిచెల్‌ స్టార్క్‌, మోహిత్‌ శర్మ, టి నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement