
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లతో స్టార్క్ చెలరేగాడు. తన సంచలన పేస్ బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ల దూకుడును కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్టార్క్ నిప్పులు చేరిగాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్.. 35 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
స్టార్క్‌కు ఇది తొలి ఐపీఎల్ ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా అంతకుముందు 2023లో ఇదే విశాఖపట్నంలో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో స్టార్క్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే మైదానంలో వన్డే, ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ప్రంపచంలో ఏ బౌలర్ ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించలేకపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విదేశీ బౌలర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌తో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు.