
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా, ఆటగాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత అతడిది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ కూల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అయితే ధోని తాజాగా రాజ్ షమానీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనికి హోస్ట్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్నఎదురైంది. తన ఆల్ టైమ్ ప్లేయింగ్‌ను ఎంచుకోమని అతడిని అడిగారు. అందుకు ధోని తక్షణమే తిరస్కరించాడు. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోపోయినప్పటికి, ఎప్పటికీ తను కలిసి ఆడడానికి ఇష్టపడే నలుగురు ఆటగాళ్లను మాత్రం ధోని షార్ట్‌లిస్ట్ చేశాడు.
మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్లను ధోని ఎంచుకున్నాడు. అయితే ధోని ఎంచుకున్న ఈ నలుగురు ప్లేయర్లలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఎందుకంటే విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో విరాట్ ఓంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయినప్పటికి ధోని మాత్రం తన ఎంపిక అత్యుత్తమ నలుగురు ఆటగాళ్లలో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురుంచి వస్తున్న వార్తలపై ధోని స్పందించాడు.
"నేను ఇంకా ఐపీఎల్‌లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్‌లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ధోని తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు.