
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. అదే జోరును కొనసాగించలేకపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన కమిన్స్ బృందం.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.
ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన రైజర్స్.. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో గురువారం తలపడనున్న సన్‌రైజర్స్.. గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.
వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొన్నాడు.
కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఇదే. మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్.. ఇప్పటి వరకు సంయుక్తంగా 18 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నారు.
దీనిని బట్టి ప్రత్యర్థి బ్యాటర్లు వీరిద్దరి బౌలింగ్‌లో ఎంతలా చితక్కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. షమీ, కమిన్స్ బౌలింగ్ మెరుగుపడితేనే సన్‌రైజర్స్ పరిస్థితి బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
అదే విధంగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ‘‘జట్టులో ఒక స్పిన్నర్‌కే ఛాన్స్ ఇస్తారనిపిస్తోంది. సిమర్‌జీత్ పునరాగమనం చేస్తాడు.
అయితే, గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జీషన్ అన్సారీని మాత్రం తుదిజట్టు నుంచి పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో సిమర్‌జీత్ ఆడొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
గత మ్యాచ్‌లో (ఢిల్లీ క్యాపిటల్స్) సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదే
ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
కేకేఆర్‌దీ అదే పరిస్థితి
ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా పరిస్థితి కూడా రైజర్స్ కంటే భిన్నంగా ఏమీలేదు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో రహానే సేన ఓటమి పాలైంది.
అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచిన కేకేఆర్.. అదే జోరును కొనసాగించలేకపోయింది. చివరగా ముంబై ఇండియన్స్‌తో తలపడి ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలు
Trust the process 🔄💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/pvVEwjV95c
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025