
PC: BCCI
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో పనిచేసిన తొలి రోజుల్లో తనపై ఓ వ్యక్తి ప్రభావం చూపాడంటూ సౌతాఫ్రికా ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి ఏబీ డివిలియర్స్ మాత్రం కాదు!.. ఇంతకీ విషయం ఏమిటంటారా?!
కాగా 2008లో ఐపీఎల్ మొదలుకాగా.. ఆరంభ సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గానూ పనిచేసిన కింగ్.. టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. ఈసారీ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో తాజాగా కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జట్టుతో చేరిన తొలినాళ్లలో సౌతాఫ్రికా స్టార్ మార్క్ బౌచర్ (Mark Boucher) తననెంతో ప్రభావితం చేశాడని కింగ్ చెప్పుకొచ్చాడు.
అడగకముందే ఎన్నో విలువైన సలహాలు
‘‘ఆరంభ రోజుల్లో నాతో పాటు ఆడిన ఆటగాళ్లలో బౌచర్ అప్పట్లో నన్ను బాగా ప్రభావితం చేశాడు. నేను అడగకముందే ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడు. నేను అనుకున్న స్థాయికి చేరాలంటే.. బలహీనతలు ఎలా అధిగమించాలో వివరించాడు.
ఇండియా మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వచ్చే తదుపరి మూడు- నాలుగేళ్లలో టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారాలని.. లేదంటే.. నీకు నువ్వు ద్రోహం చేసుకున్న వాడివి అవుతావని చెప్పాడు. ఆయనతో జరిగిన సంభాషణ నన్ను ఎంతో ప్రభావితం చేసింది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మార్క్ బౌచర్ 2008 నుంచి 2010 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.
ప్లే ఆఫ్స్ చేరాలని
కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. తద్వారా పద్నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారీ ప్లే ఆఫ్స్ చేరాలని పట్టుదలగా ఉంది.
ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ తదుపరి శనివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే