
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా నాలుగో పరాజయం
సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తు
4 వికెట్లతో మెరిసిన సిరాజ్
ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్ 18వ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది.
గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్ చేసిన తర్వాత హైదరాబాద్ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అలవోకగా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్ జట్టు గెలుపు ఖాయమైంది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ సిరాజ్ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్ తరఫున ఆడిన వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు.
ఓపెనర్లు విఫలం...
టి20 క్రికెట్‌లో తొలిసారి ట్రవిస్ హెడ్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్ బౌలింగ్ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్ 45 పరుగులే చేయగలిగింది.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్ నుంచి 10వ ఓవర్ వరకు హైదరాబాద్ బ్యాటర్లు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ నమోదు కాలేదు. రషీద్ బౌలింగ్‌లో క్లాసెన్ ఈ సిక్స్ బాదాడు.
నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్ ఇషాంత్ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది.
భారీ భాగస్వామ్యం...
ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్ (5)ను వెనక్కి పంపగా, బట్లర్ (0)ను కమిన్స్ అవుట్ చేశాడు. అయితే సన్‌రైజర్స్ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్ స్కోరు 48 పరుగులకు చేరింది.
మరోవైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. అభిషేక్ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.

19 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు.
4/17 ఐపీఎల్ చరిత్రలో సిరాజ్ తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; హెడ్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 8; ఇషాన్ కిషన్ (సి) ఇషాంత్ (బి) ప్రసిధ్ 17; నితీశ్ రెడ్డి (సి) రషీద్ (బి) సాయికిషోర్ 31; క్లాసెన్ (బి) సాయికిషోర్ 27; అనికేత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 18; కమిందు (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 1; కమిన్స్ (నాటౌట్) 22; సిమర్జిత్ (బి) సిరాజ్ 0; షమీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్: సిరాజ్ 4–0–17–4, ఇషాంత్ శర్మ 4–0–53–0, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–31–0, సాయికిషోర్ 4–0–24–2.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయిసుదర్శన్ (సి) అనికేత్ (బి) షమీ 5; గిల్ (నాటౌట్) 61; బట్లర్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 0; సుందర్ (సి) అనికేత్ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్: షమీ 4–0–28–2, కమిన్స్ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్ 1–0–20–0, ఉనాద్కట్ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్ 1–0–12–0, అభిషేక్ శర్మ 1–0–18–0.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X బెంగళూరు
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం