
PC: BCCI/IPL.com
ఐపీఎల్‌లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు.
ఐపీఎల్-2025లో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఈ ఫీట్ సాధించాడు. సూర్య ఈ మైలు రాయిని కేవలం 2714 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా పేరిట ఉండేది.
రైనా 2,881 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌లో రైనాను సూర్య అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సూర్య మూడో స్దానంలో నిలిచాడు. తొలి స్దానంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(2653 బంతులు) ఉండగా.. రెండో స్దానంలో ఏబీ డివిలియర్స్(2658) ఉన్నాడు. అదేవిధంగా సూర్య మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో వరుసగా 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన సూర్య నిలిచాడు. ఉతప్ప ఐపీఎల్‌లో వరుసగా 10 సార్లు 25 ప్లస్ పరుగులు చేయగా.. సూర్య కూడా సరిగ్గా వరుసగా 10 సార్లు 25 ప్లస్ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 26 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 427 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.