కర్కశ రాజ్యం.. ఖాకీల క్రౌర్యం | - | Sakshi
Sakshi News home page

కర్కశ రాజ్యం.. ఖాకీల క్రౌర్యం

Published Tue, Sep 17 2024 12:24 AM | Last Updated on Tue, Sep 17 2024 1:21 PM

-

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసులు పావులు

ఆరుగురు దళిత బిడ్డలను స్టేషన్‌లో నిర్బంధించి చితకబాదిన వైనం

తోపులాట జరిగితే హత్యాయత్నం కేసు నమోదు

జై భీమ్‌ సినిమా కథను తలపిస్తున్న పోలీసుల తీరు

ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రోద్బలంతోనే అంటూ దళితుల ఆరోపణలు

అధికార పార్టీకి చెందిన వారిపైనే పోలీసుల దుశ్చర్య

జిల్లాలోని పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ప్రధానంగా సర్వేపల్లిలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కర్కశ రాజ్యమేలుతోంది. ఆ పార్టీ నేతలు బరితెగించి పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. కేసులు బనాయిస్తున్నారు. తాజాగా అధికార పార్టీ పెద్దల అండతో మరో అడుగు ముందుకేసి దళిత బిడ్డలపై ఖాకీలు తమ క్రౌర్యం ప్రదర్శించారు. స్టేషన్‌లో నిర్బంధించి ఒళ్లు హూనమయ్యేలా కుళ్లబొడిచారు. చివరకు బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఖాకీలు అధికార పార్టీ పెద్దల ప్రాపకం కోసం మానవత్వాన్ని మరిచి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వల్ప వివాదంపై ఆరుగురు దళిత బిడ్డలను స్టేషన్‌లో నిర్బంధించి ఒళ్లు రక్తం ఒడిసేలా లాఠీలతో కుళ్లబొడిచారు. ఆ యువకుల శరీరంపై లాఠీ దెబ్బలు చూస్తే కఠిన హృదయాలు సైతం కదిలిపోయాయి. న్యాయం కోసం దళిత వర్గాలు రోడ్డెక్కారని ఆ దళిత బిడ్డలపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వెంకటాచలంలో జరిగిన కేసుకు సంబంధించి ముత్తుకూరు ఎస్సై, కానిస్టేబుల్‌ తమ పరిధిలో దాటి వచ్చి ఇంత అమానుషంగా ప్రవర్తించారు. ఈ దాష్టీకంలో పాలుపంచుకున్న పోలీసులను కాపాడేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇంత జరుగతున్నా పోలీస్‌ బాస్‌ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం మజరా మొలకలపూడికి చెందిన వేణుకు ముత్తుకూరు చెందిన హరీష్‌కు పాత కక్షలు ఉన్నాయి. మొలకలపూడిలో జరిగిన వినాయకుడి నిమజ్జనంలో వాయిద్యాలు వాయించేందుకు హరీష్‌, చక్రవర్తి మరో నలుగురు యువకులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకున్న వేణు వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తనపై హరీష్‌, చక్రవర్తి మరో నలుగురు యువకులు హత్యాయత్నం చేశారని వేణు వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హరీష్‌ కూడా తన స్నేహితులతో కలిసి ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే ముత్తుకూరు ఎస్సై బాధితుల ఫిర్యాదు స్వీకరించకపోగా వారిని వెంకటాచలం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించి చితకబాదారు. వారికి సంబంధం లేకపోయినా, వారి పరిధి కాకపోయినా దళిత యువకులను విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలతో శరీరమంతా రక్తం గడ్డ కట్టి గాయాలు కనిపించాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు హడావుడిగా వారిపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపారు. ఈ వ్యవహరం మొత్తం జై భీమ్‌ సినిమా కథను తలపిస్తోంది.

సోమిరెడ్డి విజయం కోసం పనిచేసిన దళితబిడ్డలు
దళిత యువకులపై పోలీసులు లాఠీ దెబ్బలు, ఈ దారుణానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోపోవడం వెనుక అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లుగా ప్రచారం ఉంది. బాధిత యువకులు సైతం అధికార పార్టీకి చెందిన వారే. వీరంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్థానిక సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపు కోసం పని చేశారు. టీడీపీ తరఫున ఏజెంట్లుగా పనిచేశారు. అయితే సదరు అధికార పార్టీ పెద్దలు మరో సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ దళితులపై దాడిని, పోలీసులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమిరెడ్డి గెలుపు కోసం పనిచేసిన దళితులపై పోలీసులు దాడి చేసినా ఎమ్మెల్యేగా ఉండీ పట్టించుకోకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం కోసం పోరాటం

దళిత వర్గాలు తమ బిడ్డలకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఎస్పీ కృష్ణకాంత్‌ను కలిసి పోలీసుల అమానుషత్వంపై విచారించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఒక వేళ తప్పు చేసి ఉన్నా.. పోలీసులు విచక్షణ మరిచి లాఠీలతో కుళ్ల పోడవడం న్యాయమేనా అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. దళితులపై క్రూరంగా వ్యవహరించిన పోలీసులపై కనీస విచారణకు ఆదేశించలేదని దళిత వర్గాలు పోలీసుల తీరుపై భగ్గుమంటున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement