
శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సహా 25 మందిపై కేసు నమోదు
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన నేపథ్యంలో ఎస్‌ఐతో ఫిర్యాదు చేయించిన కూటమి నేతలు
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలిని ఎత్తుకెళ్లిన టీడీపీ నేతలను వదిలేసి.. జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై ఎస్సైతో కేసు పెట్టించడం చర్చనీయాంశమైంది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజున వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారు.
టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. చివరకు పోలీసులతోనే ఫిర్యాదు చేయించి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఓ దళిత మహిళను టీడీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచిన వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
ఎస్‌ఐ ఫిర్యాదుతో..
ఉప ఎన్నిక రోజున వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి రామగిరి తీసుకెళ్లాల్సిన పోలీసులు.. మార్గంమధ్యలోని చెన్నేకొత్తపల్లి నుంచి తిరుగు పయనమయ్యారు. ఎంపీటీసీ సభ్యులను సకాలంలో సమావేశ మందిరానికి తీసుకురాలేకపోవడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణమంటూ చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు రామగిరిలోనే తప్పిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు మేరకు పెనుకొండ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
25 మందిపై ఎఫ్‌ఐఆర్
శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి సహా రాప్తాడుకు చెందిన శేఖర్, మరూరు వెంకటేశ్, డోలా రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, యలక్కుంట్ల అమర్‌నాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి, కురుబ నాగిరెడ్డి, రామాంజినేయులు, ఓబుగారి హరినాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బాబురెడ్డి, ఎం.గోవిందరెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, మాధవరాజు, రఘునాథరెడ్డి, సుబ్బిరెడ్డి, ఎస్‌టీడీ శ్రీనివాసరెడ్డి, నీరుగంటి నరసింహులు, చీమల కేశవయ్య, ఎస్.రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరందరిపైనా బీఎన్‌ఎస్ సెక్షన్లు 192, 132, 125, 351 (2), 79, 223 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.