
జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామ్యకం
● కలెక్టర్‌కు జర్నలిస్టుల ఐక్య వేదిక వినతి
నెల్లూరు రూరల్: విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామ్యక చర్య అని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాల ఐక్య వేదిక నాయకులు శుక్రవారం కలెక్టర్ ఓ ఆనంద్‌ను కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన రౌడీ మూకలతో కలిసి దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు జయప్రకాష్, మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండే జర్నలిస్టులపై దాడులు విపరీతం అయ్యాయన్నారు. సాక్షిలో వార్తలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని ఆ కార్యాలయంపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. వార్తలో వాస్తవం లేకుంటే దానికి వివరణ ఇవ్వాలని, చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. సమాజంలో ఎవరు తప్పు చేసినా, పొరపాట్లు చేసిన ఎత్తి చూపించడం పత్రికల బాధ్యత అన్నారు. తప్పుడు వార్తలుగా భావిస్తే నిరసన తెలియజేసేందుకు ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతులను రాజకీయ నాయకులు పాటించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఏ పార్టీ నాయకత్వం వహించినా ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు జరిగితే ఏపీయూడబ్ల్యూజే ఖండిస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుందన్నారు. ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు.