
కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం
రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి రథోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయాన్నే అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. ఆలయ ఆవరణలో ఉంచిన రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి శాంతి, నవగ్రహ హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు.
మహాలక్ష్మీ నమోస్తుతే..
రథంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ కీర్చించారు. అనంతరం రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి సమీపాన ఉన్న ప్రధాన రోడ్డు వరకు లాగారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు తదితర వాటిని విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామానికి చెందిన బ్రహ్మణ కులస్తులు రాజవంశీకులతో కలిసి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు గంగ పూజ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి గంగ పూజ చేయనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. గంగ పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం

కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం

కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం