
మున్సిపల్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని, తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంన్నారు. ఆప్కాస్ రద్దుచేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం అన్యాయమన్నారు. ఆప్కాస్ వల్ల ఇన్నాళ్లూ దళారీల దోపిడీ, వేధింపులు లేవని, జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వాటా నిధుల్లో కోతలు లేవని చెప్పారు. ప్రైవేటు ఏజెన్సీలైతే సకాలంలో వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. విలీన పంచాయతీ కార్మికులకు జీఓ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది సంఖ్యను పెచంఆలని కోరారు. సెలవులు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. పనిముట్లు, వాహనాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో కె.రాజు, ఎ.రాము, ఎ.గురుస్వామి, ఎ.శేఖర్, జె.మాధవి, డి.యుగంధర్, శంకర్ గణేష్, ఎ.దేవసంతోష్, బాల, ఎ.జనార్దనరావు, డ్రైవర్లు హరి, నాని, ఇంజినీరింగ్ విభాగం నాయకులు పి.మణి, త్రినాథరావు, క్లాప్ డ్రైవర్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.