
వంశధారకు గర్భశోకం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
గారలోని వంశధార నదిలో విధ్వంస రచన జరుగుతోంది. ఇంత విధ్వంసం జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు. 15నుంచి 20 మీటర్ల లోతు లో నదుల్లో ఇసుక తోడేస్తున్నారు. పట్ట పగలు యంత్రాలు పెట్టి మరీ ఇసుక తీసుకెళ్లిపోతుంటే.. అధికారులు చోద్యం చూడడం విస్మయం కలిగిస్తోంది.
చినబాబు పేరు చెప్పి
‘చినబాబు’ పేరు చెప్పి కొందరు వంశధారను కొల్లగొడుతున్నారు. రాత్రింబవళ్లు ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. నదీమ తల్లికి గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ, పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పట్టపగలే ఇసుకను దోచేస్తున్నారు. వందల టిప్పర్లతో తరలించేస్తున్నారు. దీంతో జల వనరులు ధ్వంసమవుతున్నాయి. నదీ గర్భంలో ఇసుకను తోడేస్తుండటంతో అవి రూపం కోల్పోతున్నాయి. జీవ నది కాస్త వాగులా మారిపోతోంది. 15నుంచి 20అడుగుల లోతులో తవ్వకాలు జరపడంతో ఎక్కడా నీటి నిల్వ లేకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. 40 మీటర్ల వరకు అడుగంటిపోతున్నాయి.
పట్టించుకోని అధికారులు
అడ్డు అదుపూ లేని ఇసుక తవ్వకాలు అటు పర్యావరణం, ఇటు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదీ గర్భంతో పాటు తీరాల్లోనూ ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో చినుకు నేలలోకి ఇంకే పరిస్థితి ఉండటం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు మరింత కిందకు జారిపోతున్నాయి. జలసిరితో కళకళలాడాల్సిన భూగర్భం తడారి ఎడారిగా మారుతోంది. నదీ గర్భంలో సైతం నీటి జాడ కరువవుతోంది. లోతైన గోతులు, కనుమరుగవుతున్న ఇసుకతో నదీ గమనం మారిపోతోంది. నదికి రక్షణగా నిలవాల్సిన కరకట్టలు బలహీనమైపోతున్నాయి. కళ్లెదుటే తవ్వకాలు జరుగుతున్నా.. ఇసుక లారీలు తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
ఎన్జీటీ ఆదేశాలున్నా..
గారలోని వంశధార నదిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తవ్వకాలను ఆపాలని ఆదేశించింది. కానీ ఇక్కడ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదు. అక్రమ తవ్వకాలకు వంత పాడుతున్నారు. చినబాబో... పెదబాబో పేరు చెప్పి అక్రమార్కులు విధ్వంసం సృష్టిస్తున్నారు. తమ జేబులు నింపుకోవడానికి వంశధారను ఛిద్రం చేస్తున్నారు. ఏదో ఒక నెపంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. దర్జాగా వందల టిప్పర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్, ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై స్థానికులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు.
చినబాబు పేరు చెప్పి విధ్వంసం
ఎన్జీటీ ఆదేశాలకు తిలోదకాలు
పగలు, రాత్రి తేడా లేకుండా నదిలో ఇసుక తోడేస్తున్న వైనం
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఉప్పునీటిమయం అవుతున్న
మంచినీటి వనరులు
భూగర్భ జలాలు ప్రమాదకర(ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థితికి చేరుకుంటే ఆ ప్రాంతాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి. నోటిఫైడ్ ప్రాంతాల్లో కేవలం స్థానిక గ్రామ, పట్టణ అవసరాలకు మాత్రమే తవ్వకాలు జరపాలి. డ్యాములు, బ్రిడ్జిలు, నీటి పంపులు, మంచినీటి బావులకు 500మీటర్ల పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదు. తీరంలో 8 మీటర్లు ఆపై లోతులో ఇసుక లభ్యత ఉంటే గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. నది గర్భం నుంచి తీరం వరకు 15 మీటర్ల వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి.

వంశధారకు గర్భశోకం

వంశధారకు గర్భశోకం