
ఆస్కాలో అలరించిన అష్టావధానం
సాక్షి, చైన్నె: ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ట్రస్ట్ (ఆస్కా ట్రస్ట్) ఆధ్వర్యంలో ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ సారథ్యంలో 8 మంది మహిళామణులతో అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీనగర్ లోని ఆస్కా ప్రాంగణంలో శనివారం సాయంత్రం 5.45 గంటలకు అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అరుణా శ్రీనాథ్ ప్రార్థన గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆస్కా అధ్యక్షుడు, ఆస్కా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె.సుబ్బారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. అవధాన ప్రక్రియ తెలుగువారికి గర్వకారణమని, దీనిని మద్రాసు మహానగరంలో తెలుగు వారికి కానుకగా అందించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆస్కా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, ఆ దిశగా మాతృభాషకు సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన జేకే రెడ్డి పద్యాలతో ఆకట్టుకున్నారు. ముందుగా ఆస్కా ట్రస్ట్ తరఫున గుండె సమస్యలు ఉన్న లక్ష్మీ, కిడ్నీ సమస్యలు ఉన్న ఆర్.దేవిక అనే ఇద్దరికి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించారు. జేకే రెడ్డిని సకలకళా వల్లభ పురస్కారంతో సత్కరించారు.
అష్టావధానం
ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అష్టావధానంను అద్భుతంగా నిర్వహించారు. ఇందులో పృచ్ఛకులుగా రాపర్తి ఝాన్సీ(నిషిద్ధాక్షరి), డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద(సమస్య), డాక్టర్ పి.ఎస్.మైథిలి (దత్తపది), డాక్టర్ టి.మోహనశ్రీ (వర్ణన), డాక్టర్ ఎ.వి.శివకుమారి(వ్యస్తాక్షరి), ఎస్.పి.వసంతలక్ష్మి(వారగణనం), కమలాకర రాజేశ్వరి(ఆశువు), బిట్రా గజ గౌరి(అప్రస్తుత ప్రసంగం) అనే 8 మంది పాల్గొని తమదైన రీతిలో ఆకట్టుకున్నారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బులుసు అపర్ణ అలవోకగా సమాధానాలు ఇస్తూ సందర్భానుసారంగా పద్యాలతోనూ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆస్కా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పి.శ్రీనివాసులురెడ్డి, ట్రస్ట్ సెక్రటరీ ఎ.ఆదినారాయణ రెడ్డి, ట్రస్ట్ కోశాధికారి బీవీఎస్ కోటేశ్వర రావు, తమిళనాడు ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సుధాకర్ రావు, ఆస్కా సభ్యులు పాల్గొని అష్టావధానంలో పాల్గొన్న తెలుగు కవులు, పండితులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. గాయని వినీషా విశిష్ట తనదైన శైలిలో శ్రీకృష్ణుడి పెయింటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు ఆదిశేషయ్య, సీఎంకే రెడ్డి, ఆనందకుమార్‌రెడ్డి, చలపతిరావు, ఎం.రంగారెడ్డి, ఊరా లక్ష్మీ నరసింహారావు, కాసల నాగభూషణం, తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.
● జేకే రెడ్డికి సకలవల్లభ పురస్కార ప్రదానం

ఆస్కాలో అలరించిన అష్టావధానం