
నగరాన్ని రెండోసారి టార్గెట్ చేసిన రియాజ్
2012 నవంబర్ 28న యాసీన్ భత్కల్‌కు ఆదేశాలు
2013 ఫిబ్రవరిలోనే నగరానికి వచ్చిన ఉగ్రవాదులు
అన్నీ సమకూరిన తర్వాత జంట పేలుళ్లతో మారణహోమం
సాక్షి, హైదరాబాద్: ఒక సూత్రధారి.. మరో సహాయకుడు.. నలుగురు పాత్రధారులు.. 16 రోజుల ఆపరేషన్.. 25 కేజీల పేలుడు పదార్థం... వెరసీ.. 18 ప్రాణాలు. 2023 ఫిబ్రవరిలో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల నేపథ్యమిదీ. ఈ కేసులోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను మంగళవారం హైకోర్టు సమర్థించిన విషయం విదితమే.
పాక్ నుంచి కథ నడిపిన రియాజ్...
పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యాసీన్ భత్కల్‌కు ఈ–మెయిల్ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. ఇతడు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, వఖాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్‌లను రంగంలోకి దింపాడు. అప్పటి వరకు వీరంతా మంగుళూరులోనే ఉన్నారు. పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం 16 రోజుల ముందు (2013 ఫిబ్రవరి 5న) నగరానికి చేరుకున్న మోను అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హడ్డీ అదే నెల 10న హైదరాబాద్ చేరుకున్నాడు. గదితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి సంతృప్తి చెందిన హడ్డీ తిరిగి మంగుళూరు వెళ్లాడు. భత్కల్స్ ఆదేశాల మేరకు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి 25 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం, 30 డిటొనేటర్లు ఉన్న బంగారం రంగు బ్యాగ్ ఇతడికి అందింది.
సైకిళ్లు, కుక్కర్లు ఇక్కడే కొనుగోలు..
ముందు హడ్డీతో పాటు వఖాస్ సైతం పేలుడు పదార్థాలతో సిటీకి వచ్చారు. మలక్‌పేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో రెక్కీ చేసినా.. దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేశారు. 2013 ఫిబ్రవరి 19న చిన్న బాంబు తయారు చేసిన హడ్డీ అబ్దుల్లాపూర్‌మెట్ కొండల్లో టెస్ట్ బ్లాస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు (2013 ఫిబ్రవరి 20) హడ్డీ, వఖాస్, మోను ముగ్గురూ కలిసి మలక్‌పేట వెళ్లి... యశోదా ఆస్పత్రి నుంచి టీవీ టవర్ వైపునకు వచ్చే మార్గంలో ఉన్న ఓ సైకిల్ రిపేరింగ్ దుకాణం నుంచి పాత సైకిల్ కొన్నారు. మరొకటి కావాలనగా దాని యజమాని పాత బస్తీలోని జుమ్మేరాత్ బజార్ వెళ్లాలని సూచించాడు.
మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో పార్క్ చేసి..
ఆ సైకిల్‌ను మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ చేసి.. ముగ్గురూ ఆటోలో లక్డీకాపూల్ వెళ్లి మంగుళూరు వెళ్లేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తిరిగి వస్తూ బాంబుల తయారీకి ఎల్బీ నగర్‌లో రెండు ప్రెషర్ కుక్కర్లు, ఆ సమీపంలోని పండ్ల వ్యాపారుల నుంచి కొన్ని ఖాళీ చిన్న సైజు అట్ట పెట్టెలు కొనుగోలు చేశారు. బి–డే (బ్లాస్ట్ డే) అయిన 2013 ఫిబ్రవరి 21 ఉదయం వఖాస్‌కు బాంబుల తయారీ బాధ్యతల్ని అప్పగించిన హడ్డీ, మోను 11 గంటల ప్రాంతంలో పాతబస్తీలోని జుమ్మేరాత్‌బజార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పాత సైకిల్ కొనుగోలు చేసి దాన్ని కూడా తీసుకుని మలక్‌పేట రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో మొదటి సైకిల్ పెట్టిన చోటే పెట్టి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు బాంబుల తయారీ పూర్తయింది.
విధ్వంసానికి ముందే గది ఖాళీ..
రెక్కీ ప్రకారం ఏ–1 మిర్చ్ సెంటర్, దాని వెనుక రోడ్డులో అనునిత్యం రద్దీగా ఉండే మద్యం దుకాణం వద్ద బాంబులు పెట్టాలి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ త్రయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదిని ఖాళీ చేసింది. రెండు కుక్కర్ బాంబుల్ని పట్టుకున్న ముగ్గురూ షేర్ ఆటోలో ఎల్బీనగర్‌కు, అక్కడ నుంచి ప్రత్యేక ఆటోలో మలక్‌పేట వచ్చారు. రైల్వేస్టేషన్ పార్కింగ్ నుంచి సైకిళ్లను తీసుకున్నారు. ప్యాక్ చేసిన బాంబుల్ని వాటిపై పెట్టుకున్న ముగ్గురూ దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చారు. మొదటి సైకిల్ తీసుకుని మోను, రెండో సైకిల్‌తో వఖాస్ వెళ్లగా... హడ్డీ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద ఎదురు చూశాడు.
మోను నేరుగా వెళ్లి ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్ పెట్టాడు. మద్యం దుకాణం వరకు చేరే సమయం లేదని నిర్థారించుకున్న వఖాస్ 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెళ్లిపోయాడు. పేలుళ్లు జరిగిన అనంతరం హడ్డీ, మోను గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి ఆటోలో లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ట్రావెల్స్‌కు చెందిన షటిల్ సరీ్వస్ వ్యానులో రేతి»ౌలి చౌరస్తా చేరుకుని అక్కడ నుంచి ట్రావెల్స్ బస్సులో మంగుళూరు వెళ్లిపోయారు. సైకిల్ పెట్టిన తరవాత వేరే మార్గంలో మోను నగరాన్ని దాటి వెళ్లిపోయాడు.