
గ్రేటర్‌లో 40 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు
గురువారం 4,170 మెగావాట్లకు చేరిన డిమాండ్
భారీగా పెరుగుతున్న గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్ (90.68 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు
అంచనా వేస్తున్నారు.
ఆన్‌లోనే ఏసీలు, కూలర్లు
గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.