
స్పెషల్ బ్రాంచ్‌లో రిజిస్టరైంది 208 మంది
వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది
కేంద్రం నిర్ణయం నేపథ్యంలో అప్రమత్తం
సాక్షి,హైదరబాద్: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం.. దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్న పాకిస్థానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) రిజస్టర్ చేసుకున్న పాకిస్థానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీయులు ఇక్కడ కచి్చతంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఫోన్ నంబర్? చిరునామా? తదితరాలను అందించాల్సి ఉంటుంది.
మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లూ శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మా త్రం ఎస్బీ అధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచ్‌ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టరై ఉన్న పాకిస్థానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్థానీలతో పాటు వారి రక్త సంబం«దీకులకు ఈ వీసాలు జారీ చేస్తుంటారు.
మరో 13 మంది షార్ట్‌టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్‌టర్మ్ కిందికి వస్తా యి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతున్నాయి. సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా 24 రకాల వారికి ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తుంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు.
నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వదలాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎందరు ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటి కీ ఎవరైనా మిగిలిన ఉన్నట్లు తేలితే వారిని పట్టుకుని బలవంతంగా తిప్పి పంపుతారని ఓ అధికారి తెలిపారు.