కాల్‌లో ప్రియురాలు.. కాబోయే ఇల్లాలు వీడుకోలు! | Grooms Conference Call Mistake Cancels Wedding In Adilabad | Sakshi
Sakshi News home page

కాల్‌లో ప్రియురాలు.. కాబోయే ఇల్లాలు వీడుకోలు!

Published Fri, Mar 28 2025 7:21 AM | Last Updated on Fri, Mar 28 2025 8:33 AM

Grooms Conference Call Mistake Cancels Wedding In Adilabad

ఏం జరిగిందో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడికి నెలకిందట పెళ్లి నిశ్చయమైంది.

‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్‌తా హై దిల్’ అంటూ ఆ కుర్రవాడు బహుశా లోలోపల సాంగేసుకుని ఉండవచ్చు. ఒక ప్యారీతో ప్యార్ నడుస్తూ ఉండగానే.. మరో పోరి పెళ్లికి రెడీ అయిపోయి.. తనకు కట్నం కూడా ముట్టజెప్పిన తరువాత.. ఇక డర్ నే కోయీ బాత్ హై క్యా అనుకుని సంబరపడుతూ చెలరేగి ఉండవచ్చు. కానీ.. అరచేతిలో ఉండే భూతం మొబైలు ఫోను మీటలు నొక్కడంలో చిన్న పొరబాటు అతగాడి కపటమైన కలలన్నింటినీ కల్లలు చేసేసింది.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఎంత కాదనుకున్నా.. వంటింట్లో ప్రియురాలిని పనిలో పెట్టి.. ఆ సంగతి ఇల్లాలికి తెలియకుండా మేనేజ్ చేయడానికి నానా పాట్లు పడుతూ.. హీరో ఆ చిత్రంలో ఒక వర్గం ప్రేక్షకులను బాగానే అలరించాడు. అయితే జీవితం అంటే ముందుగా స్క్రిప్టు రాసుకుని, ఆ మేరకు మాత్రమే సీన్లను నడిపించుకుంటూ వెళ్లే సినిమా కాదు కదా! జీవితం అన్నాక.. అందులో ఎన్నెన్నో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అనూహ్య  మలుపులు ఎదురవుతాయి. కొన్ని మన కొంప ముంచుతాయి కూడా! ఆదిలాబాద్ జిల్లాలోని ఓ జల్సారాయుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతగాడు దాచిన గుట్టు రట్టవడంతో.. కొంప కొల్లేరయింది. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లి పెటాకులు అయింది.

ఏం జరిగిందో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడికి నెలకిందట పెళ్లి నిశ్చయమైంది. వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. నిశ్చయమైన తరువాత.. ఒకరితో ఒకరు ఫోను సంభాషణలు కూడా ప్రారంభించుకున్నారు. నెలరోజుల్లో పెళ్లిఉంది. ఇరువైపులా పెళ్లి పనులు కూడా ముమ్మరంగానే మొదలయ్యాయి. రోజులిలా రొమాంటిక్ గా నడుస్తుండగా.. ఒకనాడు కాబోయే భర్తకు ఆ అమ్మాయి ఫోను చేసింది. కాల్ వెయిటింగ్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి అతగాడు.. ఫోనులో తన ప్రియురాలితో ముచ్చట్లు నడిపిస్తున్నాడు. స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి రొమాంటిక్ సమయంలో వచ్చిన కాల్.. పెళ్లయని తర్వాత భార్యనుంచి అయితే.. కాస్త ఇగ్నోర్ చేసి ఉండేవాడేమో గానీ.. ‘కాబోయే’ భార్య గనుక వెంటనే ఆన్సర్ చేశాడు. అవతలి ప్రియురాలి కాల్ ఆటోమేటిగ్గా ‘హోల్డ్’ లోకి వెళ్లింది. ‘తాను బైక్ పై ఉన్నానని, మళ్లీ కాల్ చేస్తానని’ కాబోయే భార్యకు చెప్పాడు. ఆమె కూడా నమ్మింది.

అక్కడే మనవాడు పప్పులో కాలేయడం జరిగింది. కాబోయే భార్య కాల్‌ను కట్ చేయబోయి.. ‘మెర్జ్’ బటన్ నొక్కేసి.. ప్రియురాలితో సంభాషణను యథావిధిగా కొనసాగిస్తూ పోయాడు. మళ్లీ చేస్తానన్న కాబోయే భర్త, ఆయనే కాల్ కట్ చేస్తాడని ఎదురుచూస్తున్న వధువుకు.. సంభాషణ కంటిన్యూ అవుతూ వినిపించింది. ఒకటి రెండు డైలాగులు విన్న తరువాత, ఆ సంభాషణ కాబోయే ప్రియురాలితో సాగుతున్నదని కూడా అర్థమైంది.

ఆ బంధం బహు రొమాంటిక్ గా సాగుతున్నదని కూడా ఆమె గ్రహించింది. సైలెంట్ గా వారి సంభాషణ మొత్తం వింది. వినడం మాత్రమే కాదు. రికార్డు కూడా చేసింది. ఆ ఆడియో రికార్డు తీసుకువెళ్లి పెద్దల ఎదుట ఉంచింది. వాళ్లు ముందు కంగు తిన్నారు. తరువాత కారాలు మిరియాలు నూరారు.  ఆ తరువాత.. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పటికే సమర్పించుకున్న కట్నం సొమ్మును అణా పైసల్తో సహా వెనక్కు లాక్కున్నారు. కరతలమలపై చరవాణి సేదతీరుతుండగా.. వీనులవిందుగా ప్రియురాలు రస భాషణ సాగిస్తుండగా.. మైమరచిన కైపులో ఒళ్లు దగ్గర పెట్టుకోకుండా.. ఏదో బటన్ నొక్కబోయి.. ఇంకేదో నొక్కితే.. విధి ఇలాగే వికటాట్టహాసం చేస్తుందని కుర్రకారు చాలా మంది పాఠాలు నేర్చుకోవాలి వీడినుంచి!
-ఎం. రాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement