
- కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వెనక్కి తగ్గని ఐఏఎస్
- పోలీసులు నోటిసులకు ఘాటుగా బదులిచ్చిన వైనం
- ఫోటో షేర్ చేసిన 2వేల మంది ఇతరులపై చర్యలు తీసుకున్నారా? అని పోలీసులకు ప్రశ్న
- లేకుంటే చట్టముందు సమానత్వం, తటస్థట సూత్రాల ఉల్లంఘననే అని వ్యాఖ్య
- ఎక్స్‌వేదికగా మళ్లీ స‍్పందించిన స్మిత సబర్వాల్
- ఓడిన వారికోసమే ఆ ఐఏఎస్ ఏడ్పు అని పరోక్షంగా స్పందించిన సీఎం సీపీఆర్వో
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్ ఫోటోను ‘హాయ్ హైదరాబాద్’ అనే హాండిల్ గత మార్చి 31న సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్ షేర్ చేశారు.
హెచ్‌సీయూలో ఉన్న మష్రూమ్ రాక్, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ‍్ల ఆర్ట్’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్ హెచ్‌సీయూ..సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్ హైదరాబాద్’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ‍్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్) చట‍్టం కింద ఇచి‍్చన నోటిసులకు నా స్టేట్మెంట్‌ను ఈ రోజు ఇచ్చారు.
ఆ పోస్టును 2వేల మంది షేర్ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్’ వేదికగా కొత్త పోస్టు పెట‍్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ‍్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్ చేశారు.
‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్’ మహిళా జర్నలిసు‍్ట రేవతి సైతం స్మిత సబర్వాల్‌కు మద్దతుగా ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్‌ఎస్ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
వివాదాలు కొత్త కాదు...
స్మితా సబర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్‌తో పూజా ఖేద్కర్ అని యువతి ఐఏఎస్ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్‌లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ‍్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి‍్టవేసింది.
ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్న
స్మిత సబర్వాల్ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్‌ఎస్ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.
ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్‌ఎస్) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ జరిగిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
-మహమ్మద్ ఫసియుద్దీన్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి