
తొలిరోజు తప్పని తిప్పలు
భారీగా ట్రాఫిక్‌జాం
వాహనదారుల అసంతృప్తి
హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం పాటు మూసివేసిన తార్నాక జంక్షన్ (సిగ్నల్)ను శుక్రవారం రీ ఓపెన్ చేశారు. ఇంత కాలం ఓయూ క్యాంపస్ నుంచి లాలాపేట వైపు వెళ్లే వారు యూ టర్న్ నుంచి రాకపోకలు సాగించేవారు. సిగ్నల్ సిస్టమ్‌ను పునరుద్ధరించడంతో ఓయూ వైపు నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులు నేరుగా సిగ్నల్ వద్ద ఆగి వెళుతున్నారు. హబ్సిగూడ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులకు యథావిధిగా రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ టర్న్ తీసుకువెళ్లాలనీ ట్రాఫిక్ పోలీసులు అనౌన్స్‌మెంట్ ద్వారా తెలియజేశారు.
గుడ్ ఫ్రైడే హాలీ డే రోజే ఇలా ఉంటే ఇక వర్కింగ్ డే మరింత వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు లాలాపేట వైపు సెయింటాన్స్ స్కూల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
తార్నాక, లాలాపేట రోడ్డులో వాహనాల రద్దీ
తార్నాక జంక్షన్ పునరుద్ధరణతో రోజంతా ట్రాఫిక్ జాం నెలకొంది. ఓయూ క్యాంపస్ నుంచి తార్నాక, లాలాపేట ప్రధాన రహదారిలో వాహనాలు బారులు తీరాయి. లాలాపేట రోడ్డు విస్తరణ పనులు దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. విస్తరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫలితంగా ఈ మార్గంలో దాదాపు అర కిలో మీటర్ మేర ట్రాఫిక్‌జాం నెలకొంది.
యూటర్న్‌తోనే ట్రాఫిక్‌కు చెక్
గతంలో ఉన్న యూ టర్న్‌తో తార్నాక జంక్షన్‌లో వాహనాల రద్దీ తగ్గింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగింది. పెరిగిన వాహనాల సంఖ్యను అధికారులు పొరపాటుగా అంచనా వేశారు. తార్నాక జంక్షన్ విస్తరణ, రోడ్ల విస్తరణ చేపట్టకుండా రీఓపెన్ చేయడం సరికాదు. అధికారులు పునరాలోచించాలి.
– సూరి, ద్విచక్ర వాహనదారు
రోడ్డు విస్తరణ చేపడితేనే..
తార్నాక చౌరస్తా నుంచి లాలాపేట వరకు రోడ్డు ఇరుకుగా మారింది. వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం చెందారు. ప్రస్తుతం ఉన్న రోడ్డులోనే చిన్నపాటి డివైడర్లు ఏర్పాటు చేసి జంక్షన్‌ను ఓపెన్ చేయడంతో వాహనాల రద్దీ నెలకొంది. – రవి. లాలాపేట, వాహనదారు