
2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు వర్తింపు
ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు.. ఆదేశాలు జారీ చేసిన రవాణా శాఖ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేకున్నా చూసీచూడనట్టు వెళ్లిన యంత్రాంగం ఇకపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏర్పాటు నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన వాహనాలకు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
అంటే, అన్ని వాహనాలకు ఇకపై కచ్చితంగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉండాల్సిందేనన్నమాట. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అప్పట్లో అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, దాని అమలులో యంత్రాంగం ఉదాసీనంగా ఉండటం, పాత వాహనాలకు ఆ నంబర్ ప్లేట్లు లేకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చు కోవాల్సిందేనని అందులో స్పష్టం చేసింది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు హెచ్‌ఎస్‌ఆర్‌పీలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఏర్పాటు చేసుకోని వాహనాలు గడువు తర్వాత రోడ్డెక్కితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. ఫిట్‌నెస్ టెస్ట్ సహా వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు ఇవ్వబోమని.
వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం కుదరదని తేల్చి చెప్పటం విశేషం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాత వాహనదారులు ఈ నంబర్ ప్లేట్ కోసం www.siam.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రవాణాశాఖ సూచించింది.

పంపిణీ ఎలా సాధ్యం?
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు విషయంలో ముందునుంచి ప్రభుత్వం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వాహనాలు కొంటున్న వారిలో 75 శాతం మంది వాటిని కాకుండా, నచ్చిన తరహాలో ఉండే సాధారణ నంబర్ ప్లేట్లనే ఏర్పాటు చేసుకుంటున్నా ఎలాంటి చర్యలు లేవు. వాహనాలను తనిఖీ చేసేప్పుడు హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుంటే ఫైన్ కూడా విధించటం లేదు. దీంతో వాటి విషయంలో వాహనదారుల్లో శ్రద్ధే లేకుండా పోయింది.
ఇక, రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రాష్ట్రంలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల సరఫరా ఉండటం లేదు. ముందునుంచీ వీటి తయారీ, సరఫరా తీవ్ర గందరగోళంగా మారింది. ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇప్పుడు ఒకేసారి పాత వాహనాలకు కూడా ఆ నంబర్ ప్లేట్లను అమర్చాలని ఆదేశాలివ్వటంతో వాటిని ఎలా సరఫరా చేస్తారో అధికారులకే తెలియాలి.
తాజా ఆదేశం మేరకు దాదాపు 90 లక్షల వరకు నంబర్ ప్లేట్లను సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర రవాణాశాఖ స్పష్టంగా ఆదేశించటంతో, దీనిని కచ్చితంగా అమలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. కానీ నంబర్ ప్లేట్ల తయారీ, సరఫరా అంశం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో, ఇది అధికారులకు కత్తిమీద సామే కానుంది.