
‘ఎకోరెన్’ ఆధ్వర్యంలో 5,579 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, జీపీఎస్‌ఆర్ ఆర్య ఆధ్వర్యంలో 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల స్థాపన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఆయా కంపెనీలతో రెడ్కో 4 ఎంఓయూలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.29,000 కోట్ల భారీ పెట్టుబడులతో 5,579 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతోపాటు 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన రెండు ప్రైవేటు వ్యాపార సంస్థలతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో రెడ్కో ఈ మేరకు మొత్తం నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టుల స్థాపనతో రాష్ట్రంలో 19,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎకోరెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో మొత్తం 5,579 మెగావాట్ల సామర్థ్యంతో మూడు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మూడు ఎంఓయూలు కుదుర్చుకుంది.
» సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 3,279 మెగావాట్ల పవన–సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది.
» జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 7 ప్రాంతాల్లో మొత్తం 1,650 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును స్థాపించనుంది.
» జోగుళాంబ గద్వాల జిల్లాలో 650 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ మూడు ప్రాజెక్టుల ఏర్పాటుతో 16,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో రూ.1600 కోట్ల ఆదాయం రానుంది.
» జీఎస్‌పీఆర్ ఆర్య సంస్థ రూ.2000 కోట్ల పెట్టుబడులతో 15 జిల్లాల్లో 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకోగా, 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
» వరి గడ్డి నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుండగా, ఒక్కో ప్రాజెక్టు 15 టన్స్ పర్‌డే(టీపీడీ)ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి.
ఎనర్జీ పాలసీతోనే : భట్టి
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వీసీ, ఎండీ వి.అనీల, ఎకోరెన్ కంపెనీ ఎండీ ప్రసాద్, జీపీఎస్‌ఆర్ ఆర్య కంపెనీ ఎండీ దీపక్ అగర్వాల్ పాల్గొన్నారు.