
ప్రస్తుతం ఆర్టీసీలో 3,200 అద్దె బస్సులు
ఈ బస్సుల డ్రైవర్లంతా ప్రైవేటువారే
ఔట్‌సోర్సింగ్ విధానంలో మరో 1,500 మంది డ్రైవర్లు
వీరంతా సమ్మెలో పాల్గొనకుంటే ప్రభావం అంతంతే
దీంతో వారినీ కలుపుకొనే దిశగా కార్మిక సంఘాల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: టీజీఆర్టీసీలో సమ్మె అనివార్యమైతే అద్దె బస్సులు, గ్రాస్‌కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను కూడా సమ్మెలో భాగం చేసేలా కార్మిక సంఘాలు కసరత్తు ప్రారంభించాయి. వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మె ఉంటుందని ఆర్టీసీలోని ఒక జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుతం అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొని బస్సులను బయటకు తీయకున్నా, అద్దె బస్సులు రోడ్డెక్కితే ప్రయాణికులకు కొంతవరకు రవాణా కష్టాలు దూరమవుతాయి.
దీంతో సమ్మె ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదన్నది కార్మికసంఘాల ఆందోళన. ప్రస్తుతం ఆర్టీసీలో 9,400 బస్సులున్నాయి. వీటిల్లో ఆర్టీసీ సొంత బస్సులు 6,200 మాత్రమే. మిగతావాటిలో 2,800 అద్దె బస్సులు, 400 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. వీటికి డ్రైవర్లుగా ఆర్టీసీ సొంత ఉద్యోగులు ఉండరు. ఆ బస్సుల యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటారు. సమ్మె ప్రారంభమైతే అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లతో 3,200 బస్సులను నడుపుతారు.
34 శాతం అద్దె బస్సులే
2019లో 53 రోజుల పాటు సమ్మె జరిగిన సమయంలో ఆర్టీసీలో 11 వేల వరకు బస్సులుంటే, ఆద్దె బస్సులు 1,800 మాత్రమే ఉన్నాయి. సమ్మె ముగిసిన వెంటనే 2 వేల బస్సులు తొలగించాలని నాటి సీఎం కేసీఆర్ ఆదేశించటంతో అంతమేర బస్సులను ఆర్టీసీ ఉపసంహరించింది. ఆ తర్వాత కూడా సొంత బస్సుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. వాటి స్థానంలో అద్దె బస్సుల సంఖ్యను సంస్థ పెంచింది. ఫలితంగా ఇప్పుడు అద్దె బస్సులు 34 శాతానికి చేరాయి.
ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల వరకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 1,500 మంది ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొంతమంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. సమ్మె నాటికి మిగతా ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు కూడా విధుల్లోకి వస్తారు. వీరు కూడా సమ్మె సమయంలో బస్సులను తిప్పేందుకు అందుబాటులో ఉంటారు. వెరసి సగం బస్సులు రోడ్డెక్కటం ఖాయంగా ఉంది.
ఈ పరిస్థితి సమ్మెకు అడ్డంకిగా మారుతుందని సంఘాలు భావిస్తున్నాయి. అద్దె బస్సుల నిర్వాహకులతో చర్చించి వారు కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడాలని కొన్ని సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. డ్రైవర్, కండక్టర్లతో పాటు సూపర్‌వైజర్ల సంఘం కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడాలని పేర్కొంటున్నాయి.
రెండు జేఏసీల మధ్య కొనసాగుతున్న విభేదాలు
ఆర్టీసీలో ఒక జేఏసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చింది. మరో జేఏసీ దీనికి దూరంగా ఉంది. మొదటి జేఏసీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి రెండో జేఏసీని, జేఏసీల్లో భాగం కాని ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) నేతలను ఆహ్వానించింది. అయితే, ఆహ్వానించిన తీరు సరిగా లేదని రెండో జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు సమావేశంలో పాల్గొన్నా.. మొదటి జేఏసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హాజరైనా, రెండో జేఏసీ సహా ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు సమ్మెకు సిద్ధమైతేనే తాము సమ్మెకు మద్దతిస్తామని ప్రకటించారు. మరోవైపు ఐక్య కార్యాచరణను సాధించేందుకు రెండో జేఏసీ ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.