హన్మకొండ చౌరస్తా (వరంగల్): వేతన సవరణపై యాజమాన్యంతో చర్చించినా ఎలాంటి ఫలితం లేదని... సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు తిరుపతి, అశ్వథ్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 6న తలపెట్టిన సమ్మె నేపథ్యంలో ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వేతన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర విభజన సాకుతో కార్మికులను యూజమాన్యం అవస్థలకు గురిచేస్తోందని మండిపడ్డారు.
ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో బస్‌భవన్ వద్ద జరిగిన ధర్నాలోనే సమ్మె నోటీసు అందజేశామని, అయినా యూజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే ఆర్టీసీ ఉద్యోగులతో సమానంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5వ తేదీ లోపు వేతన సవరణ డిమాండ్‌ను పరిష్కరించలేని పక్షంలో 6వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మిక వర్గాలు సమ్మెకు దిగుతాయని చెప్పారు.