
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ మహేష్.. శ్రీదేవి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శ్రీదేవి తల్లి మంగ తన కూతురును చూసేందుకు ఇంటికి రాగా, అయితే మహేష్, శ్రీదేవిల మధ్య మరోసారి గొడవ జరిగింది. వారిని గొడవ పడొద్దని మంగ వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీదేవి స్వల్పంగా గాయపడగా.. ఆమె తల్లి మంగ తీవ్రంగా గాయపడింది. ఆమెను మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.