
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు ఇక ఏటా పెరుగుతాయా? ఏటా నిర్దేశిత గడువులోగా వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు భారీ జరిమా నాలు విధించనుండటం ఈ ప్రశ్నకు తావి స్తోంది. జరిమానాలకు సంబంధించిన ముసా యిదా మార్గదర్శకాలను ఈఆర్సీ గురువారం ప్రకటించింది.
ఏటా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)తో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ), వార్షిక పనితీరు సమీక్ష, ట్రూఅప్ చార్జీలు, వనరుల ప్రణాళిక, రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక, వ్యాపార ప్రణాళిక ప్రతిపాదనలు , మూలధన పెట్టుబడి ప్రణాళికలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది లేనిపక్షంలో.. తొలి 30 రోజుల జాప్యానికి రోజుకు రూ.5,000 చొప్పున జరిమానాలను విధించనుంది.
30 రోజుల తర్వాత అదనంగా రూ.1.50 లక్షలతో పాటు రోజుకు రూ.10 వేలు చొప్పున జరిమానాను సంబంధిత ప్రతిపాదనలు సమర్పించే వరకు వసూలు చేయనుంది. ఈ ముసాయిదా నిబంధనలపై ఈ నెల 27లోగా సలహాలు, సూచనలు తెలపాలని ఈఆర్సీ కోరింది. పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయాన్ని రాబట్టుకోవడానికి ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రాష్ట్రాలను కోరుతోంది. చార్జీల పెంపు ద్వారా మొత్తం వ్యయాన్ని రాబట్టుకో వాల్సిందేనని, నష్టాలు మిగల్చడానికి వీల్లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఈఆర్సీలు ఇప్పటికే ఈ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
నవంబర్ 30లోగా సమర్పించాల్సిందే
నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి రాష్ట్రాల డిస్కంలు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే విద్యుత్ చార్జీల పెంపుతో వచ్చే వ్యతిరేకత, విమర్శలకు భయపడి డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు అనుమతించడం లేదు.
కానీ తాజాగా ఈఆర్సీ తీసుకొచ్చిన జరిమానాల నిబంధనలతో నిర్దేశిత గడువులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా చార్జీల వడ్డన తప్పదనే అభిప్రాయాన్ని విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.