
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. మృతుడిని ఓల్డ్ బోయినపల్లి చెందిన ప్రణీత్(32)గా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
గత వారం రోజుల క్రితం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్‌కు శనివారం ఫిట్స్ రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రశాంత్ గుండెపోటుకు గురై మృతిచెందాడు.
ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్ సీసీటీవీలో రికార్డయింది. కాగా, ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు.
