
గుండెపోటుతో యువకుడి మృతి
కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు.
ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.