
కృత్రిమ మేధతో మెరుగైన విద్య
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
దోమ: కృత్రిమ మేధతో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. గురువారం మండలంలోని గుండాల్, దాదాపూర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు ఏఐ విద్య నేర్పించాలని సూచించారు. ఏఐ విధానంలో బోధన చేస్తే తొందరగా అర్థమవుతుందన్నారు. అనంతరం స్కూల్ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థుల కొలతలు తీసుకున్న తరువాతే యూనిఫాం కుట్టాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ప్రధానోపాధ్యాయుడు అమర్‌నాథ్, ఉపాధ్యాయులు, సిబ్బంది మల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, రఘుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా
టెన్త్ ఫలితాలు
ముగిసిన పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో 1,100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల జవాబు పత్రాలను దిద్ది రికార్డు సృష్టించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వలేదని ఆ శాఖ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. శనివారం నుంచి ఆయా పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 24 వరకు హాజరు కానున్నారు.
నిబంధనలు
పాటించకుంటే చర్యలు
ఆమనగల్లు: ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్ షాపుల డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయా మండలాలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందుగా తెచ్చుకోవాలని, సీజన్ ప్రారంభం నాటికి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
సామాజిక తనిఖీలు పక్కాగా జరగాలి
యాచారం: ఈజీఎస్ సామాజిక తనిఖీల కార్యక్రమం పక్కాగా జరగాలని జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీల సిబ్బందికి రికార్డులు అందజేయాలని సూచించారు. కూలీలతో కలిసి పనులు చూపించాలని, పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కృత్రిమ మేధతో మెరుగైన విద్య