Cheepurupalli: తెరపైకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు | - | Sakshi
Sakshi News home page

Cheepurupalli: తెరపైకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు

Published Wed, Feb 28 2024 2:16 AM | Last Updated on Wed, Feb 28 2024 11:52 AM

- - Sakshi

చీపురుపల్లి టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం

కరివేపాకు అయిపోయిన కిమిడి నాగార్జున

అధ్యక్షుడిగా జిల్లాలో పార్టీకి సేవచేసినా తప్పని వెన్నుపోటు

మంత్రి బొత్సను ఎదుర్కోవడానికి పనికిరాడనే నెపం

విడతకో నియోజకవర్గం మార్చేసే గంటా శ్రీనివాసరావును బలిపశువును చేసే యోచన

చీపురుపల్లి నుంచి పోటీచేయాలని చంద్రబాబు పదేపదే ఒత్తిడి

ఓడిపోయే టిక్కెట్‌ వద్దంటూ గంటా నిరాకరణ?

తాజాగా తెరపైకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు

తాడేపల్లిలో చంద్రబాబు నివాసానికి నాగార్జున పరుగు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తొలుత టీడీపీ... తర్వాత ప్రజారాజ్యం.. ఆ తర్వాత కాంగ్రెస్‌.. మళ్లీ టీడీపీ... స్థిరంగా ఒక నియోజకవర్గం లేదు. స్థిరంగా ఒక పార్టీలోనూ లేరు. ప్రజలను మభ్యపెట్టి గెలవాలి. తర్వాత ముఖం చాటేయాలి!. ఇదంతా చెబుతుంటే ఉత్తరాంధ్రలో ఠక్కున గుర్తుకొచ్చే ఏకై క వ్యక్తి... గంటా శ్రీనివాసరావు!. ఇప్పుడు ఆయనను విజయనగరం జిల్లాపై రుద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగోలా ‘గంటా’ బెడదను విదిల్చుకునేందుకు చూస్తున్నారు.

అయితే, ఆయన చంద్రబాబు చెబితే వెళ్తానంటూనే.. ఓడిపోయే టిక్కెట్‌ వద్దంటూ మరోవైపు నిరాకరిస్తున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం పనిచేసిన కిమిడి నాగార్జునకు వెన్నుపోటు తప్పలేదు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణను ఢీ కొట్టాలంటే పనికిరాడంటూ ఓ ముద్రవేసి పక్కనపెట్టేశారు. గంటా చీపురుపల్లి పోనంటే ప్రత్యామ్నాయంగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తాడేపల్లిలో చంద్రబాబు నివాసం నుంచి పిలుపుతో కిమిడి నాగార్జున మంగళవారం హుటాహుటిన బయల్దేరివెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అత్యంత గందరగోళంగా మారింది.

డోలాయమానంలో నాగార్జున..
నలభై సంవత్సరాలు పార్టీ చరిత్ర, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఎర్ర బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నా అని హెచ్చరించే లోకేశ్‌, వీరికి మద్దతుగా పవన్‌ కల్యాణ్‌... ఇంకేముంది 2024 ఎన్నికల్లో మేము హిట్‌ అనే భ్రమలో టీడీపీ క్యాడర్‌ ఇన్నాళ్లూ ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అందుకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితే అందుకు అద్దం పడుతోంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున ఎక్కడున్నాడో తెలియదు. నాలుగు మండలాల్లో పార్టీ క్యాడర్‌ ఏమైందో, ఎక్కడుందో తెలియదు. పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ నెల 21న ఈనాడు పత్రికలో ‘బొత్సకు పోటీగా గంటా’ అనే శీర్షికన వచ్చిన వార్తతో నాగార్జున హతాశులయ్యారు. పార్టీ పగ్గాలు పూర్తిగా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అతనికి చంద్రబాబు నుంచి కబురు రావడంతో తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు.

మీసాల గీత పేరు పరిశీలన...
గంటాను పంపుతున్నారని తెలిసినప్పటి నుంచి చీపురుపల్లి టీడీపీ క్యాడర్‌ తీవ్ర అసహనంలో ఉంది. స్థానికంగా తమకు అందుబాటులో ఉండే నేత కావాలని, ఎన్నికల తరువాత ముఖం చాటేసే నాయకులు వద్దని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు టిక్కెట్‌ ఇస్తే ఎలా ఉంటుందని నెల రోజుల కిందటే ఐవీఆర్‌ఎస్‌ ద్వారా టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని చంద్రబాబు సేకరించారు. అంతేకాకుండా ఇటీవల శంఖారావం సభ కోసం చీపురుపల్లి వచ్చిన నారా లోకేశ్‌ను మీసాల గీత కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గంటా గెంటివేతకు యత్నాలు...
నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్సార్‌సీపీ మరింత బలపడింది. తన ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుంది. దీనికితోడు ప్రజలతో నిత్యం మమేకమయ్యే మంత్రి బొత్స సత్యనారాయణను ఢీ కొట్టాలంటే నాగార్జున సహా జిల్లాలోని టీడీపీ నేతలెవరూ సరిపోరని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. పొరుగు జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావును ఇక్కడకు పంపాలని, తద్వారా విశాఖ జిల్లా నుంచి గెంటివేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు చీపురుపల్లి టిక్కెట్‌ వద్దని, నెల్లిమర్ల కానీ, భీమిలి కానీ ఇవ్వాలని గంటా కోరుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్‌ ఇప్పటికే జనసేన అభ్యర్థి లోకం మాధవికి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించేయడంతో ఇక అక్కడ కుదిరే పరిస్థితి లేదు. భీమిలి కూడా ఇవ్వలేని పక్షంగా మళ్లీ తన పాత స్థానం చోడవరం టిక్కెట్‌ అయినా ఇవ్వాలని గంటా కోరుతున్నట్లు తెలిసింది.

ఇన్నాళ్లూ బాధ్యతలు మోసినా...
చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణకు చాలా పట్టు ఉంది. గ్రామగ్రామాన ఆయన అనుచరగణం ఉంది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ స్వగ్రామం చీపురుపల్లి కావడం, వైఎస్సార్‌సీపీ డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మెరకముడిదాం మండలం నుంచి ఏకగ్రీవ జెడ్పీటీసీ కావడం అదనపు బలాలు. ప్రతి ఊరి నాయకులు తామే అభ్యర్థి అన్న భావంతో విజయానికి శ్రమిస్తారు. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చేతిలో భారీగా ఓట్ల తేడాతో కిమిడి నాగార్జున ఓటమి పాలయ్యారు. వేరే విధిలేని పరిస్థితుల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా ఆయనే ఇన్నాళ్లూ బాధ్యతలు చూస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం తేల్చిచెప్పకనే చెప్పడంతో ఆయన పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement