
డీసీపీయూ పోస్టులపై.. కూటమి నేతల కన్ను
● డీసీపీయూ, బాలసదన్‌ల్లో ఉద్యోగాలు తమ వారికే ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు
● 23 పోస్టులకు ఇటీవల ఇంటర్వ్యూల నిర్వాహణ
విజయనగరం ఫోర్ట్: కూటమి నేతలు అధికారం ముసుగులో అధికారులపై దర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పోస్టులను తమ వారికే కట్టబెట్టాలని అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్టు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మినీ గోకులాలు, యంత్ర పరికరాలు అధికార పార్టీకి చెందిన వారికే ఇచ్చారనే గుసగుసలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులు సర్పంచ్‌లు చేపట్టాల్సి ఉన్నప్పతికీ సర్పంచ్‌లతో సంబంధం లేకుండా వెండర్ విధానంలో కూటమికి చెందిన నేతలకు కట్టబెట్టి వారితో పనులు చేయిస్తున్నారు. తాజాగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను కూడా తమ వారికే ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
23 పోస్టులకు నోటిఫికేషన్
సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో డీసీపీయూ (జిల్లా బాలల సంరక్షణ విబాగం), బాలసదన్‌ల్లో ఖాళీల భర్తీకి 2024 సెప్టెంబర్ 4వ తేదీన 23 పోస్టులకు నోటిఫికేషన్‌ను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీసీపీయూ పోస్టు కోసం 129 మంది, డీఈఓ పోస్టు కోసం 218 మంది, సోషల్ వర్కర్ పోస్టు కోసం 55 మంది, స్టోర్ కీపర్ పోస్టు కోసం 107 మంది, కుక్ పోస్టు కోసం 36 మంది, హౌస్ కీపర్ పోస్టు కోసం 12 మంది, నైట్ వాచ్‌మెన్ పోస్టు కోసం 17 మంది, ఎడ్యుకేటర్ పోస్టు కోసం 28 మంది, మ్యూజిక్ టీచర్ పోస్టు కోసం 25 మంది, యోగా టీచర్ పోస్టు కోసం 12 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మా వారికే ఇచ్చేయండి..
23 పోస్టులకు ఇటీవల సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఈ పోస్టులపై కన్నేసిన కూటమి నేతలు తమ వారికి ఆ పోస్టులను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ఓ జాబితాను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులకు పంపించి వారికే పోస్టులు కట్టబెట్టాలని హుకుం జారీ చేసినట్టు విమర్శిలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు ఇచ్చిన జాబితాలో అర్హత లేని అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. అర్హత లేకపోయినా అధికార పార్టీకి చెందిన వారు కాబట్టి ఆ పోస్టులను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి చేస్తుండడంతో ఈ పోస్టుల భర్తీ చేసేది ఎలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పారదర్శకంగానే..
డీసీపీయూ, బాలసదన్ పోస్టుల భర్తీకి సంబంధించి సిఫార్సులు అనేవి నా దృష్టికి రాలేదు. పోస్టులను నిబంధనల ప్రకారం పారదర్శకంగానే భర్తీ చేస్తాం.
– రుక్సానా సుల్తానా బేగం, పీడీ, ఐసీడీఎస్

డీసీపీయూ పోస్టులపై.. కూటమి నేతల కన్ను