
రామతీర్థంలో జనసేన – టీడీపీ నాయకుల కొట్లాట
నెల్లిమర్ల రూరల్: మండలంలోని రామతీర్థం గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు పరస్పర కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై ఇరు వర్గాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన పార్టీ నేతగా వ్యవహరిస్తున్న పైడిరాజు ఇటీవల తన పొలంలో ఉన్న తాటి చెట్లను తొలగించారు. తన భూమి పరిధిలో ఉన్న చెట్లను సమాచారం ఇవ్వకుండా ఎందుకు తొలగించావని టీడీపీ నాయకడు తాడ్డి సత్యనారాయణ జనసేన నేత పైడిరాజు ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరికీ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. దీనిపై ఎమ్మెల్సీ నమోదు కాగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా జనసేన నాయకుడు పైడిరాజు మాట్లాడుతూ గతంలో తన భూమి పరిధిలో ఉన్న చెట్లను కూడా తొలగించారని, కేవలం రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే తనపై దాడి చేశారని తెలిపాడు.