
పెరుగుతున్న పాముకాటు బాధితులు
విజయనగరం ఫోర్ట్: గుర్ల మండలం బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (17) కొద్ది రోజుల క్రితం ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఫోన్ చేస్తుండగా పాము కాటువేసింది . కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.
● గంట్యాడ మండలం బురదపాడుకు చెందిన చుక్క రాంబాబు (39) పొలంలో గడ్డి చేనుకు నీరు పెట్టడానికి వెళ్లగా పాము కాటువేసింది. కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
● జిల్లాలో అనేక మంది పాముకాటు బారిన పడుతున్నారు. వారిలో కొంతమంది మత్యువాతపడుతుండగా మరికొంతమంది బతికి బట్టకడుతున్నారు. వ్యవసాయ పనులకు రైతులు వెళ్లేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు, పంటపొలాలకు నీరు కట్టేందుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాల్లోనే ఎక్కువగా పాముకాటు బారిన పడే ప్రమాదం ఉంది.
పంట పొలాల్లోనే ఎక్కువ:
సాధారణంగా నిర్జీవ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకువస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడుబడిన భవన శిథిలాలు, పూరిగుడిసెలు, గుబురుగా ఉండే పంటచేలల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఎలుకలను, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో రాత్రి పూట సంచరిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలాల్లోనూ, ఆరుబయట నిద్రిస్తున్న వారు ఎక్కువగా పాముకాటుకు గరవుతున్నారు.
వేసవిలోనూ తప్పని బెడద
సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా పాముల బెడద ఉంటుంది. కానీ ప్రస్తుతం వేసవికాలంలో కూడా పాముల బెడద ఎక్కువగా ఉంటోంది.
పాములపై అవగాహన ఉండాలి
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్లపాము, తాచుపాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు ధైర్యం చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనసరి
రాత్రి వేళ పొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు, టార్చిలైట్లుతో పాటు శబ్దం చేసే పరికరాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే బీపీ పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలు ఉన్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభమవుతుంది.
పంటపొలాలు, ఆరుబయట నిద్రస్తున్న వారికే ప్రమాదం
సకాలంలో ఆస్పత్రికి చేర్చితే
కాపాడవచ్చంటున్న వైద్యులు
సకాలంలో ఆస్పత్రికి తీసుకువస్తే..
పాము కాటు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తీసుకురాగలిగితే ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. సీహెచ్‌సీల్లోనూ, ఏరియా ఆస్పత్రుల్లోనూ, ఏఎస్‌వీ(యాంటీ స్నేక్ వీనమ్) అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి, డీసీహెచ్‌ఎస్