
ఎం.ఎల్.సి రోగులకు తిప్పలు..!
‘విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ అనే వ్యక్తిపై భూ తగాదాలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దాడిచేశాడు. ఆయనకు దంతాలు, మొఖంపై గాయాలయ్యాయి. రెండు రోజుల కిందట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. కొట్లాట కేసు కావడంతో ఎం.ఎల్.సిగా నమోదుచేసి చికిత్స కోసం డెంటల్ విభాగానికి పంపించారు. ఎం.ఎల్.సి కేసు కావడంతో గాయం ఎంత అయిందనే సర్టిఫికెట్ సంబంధిత వైద్యుడు ఇవ్వాల్సి ఉంటుంది. వైద్యుడు డెంటల్ ఎక్స్‌రే తీసుకుని రావాలని ఎక్స్‌రే విభాగానికి పంపించారు. డెంటల్ ఎక్స్‌రేకు సంబంధించి ఫిల్మ్‌లు లేకపోవడంతో ఇక్కడ ఎక్స్‌రే తీయలేమని చెప్పడంతో అతడిని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. చేసేది లేక కేజీహెచ్‌కు వెళ్లారు.’
విజయనగరం ఫోర్ట్:
జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎం.ఎల్.సి (మెడికో లీగల్ కేస్)కి సంబంధించిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందక ఆవేదన చెందుతున్నారు. మెడికో లీగల్ కేస్‌లలో డెంటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు అందుబాటులో లేకపోవడం, ఏజ్ సర్టిఫికెట్ మంజూరుకాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీకి సంబంధించి సంబంధిత రోగికి తగిలిన దెబ్బలు వల్ల ఎంత గాయం అయిందన్నది నిర్ధారించేందుకు ఎక్స్‌రే అవసరం. వైద్యులు ఏ ప్రాతిపదికన రోగికి సర్టిఫికెట్ ఇచ్చారని అడిగితే దానికి సాక్ష్యంగా కోర్టులో ఎక్స్‌రే చూపించాల్సి ఉంటుంది. వయసు నిర్ధారణలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఆ సదుపాయం లేకపోవడంతో కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది.
ప్రతిపాదనలు పంపించాం
ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రే విభాగం అందుబాటులో ఉంది. ఫిల్మ్‌లు ఇచ్చే ఎక్స్‌రే విభాగం లేదు. దీనికోసం ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
డెంటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేక ఇబ్బందులు
కోర్టులో సాక్ష్యం చూపించడానికి ఎక్స్‌రే ఫిల్మ్‌లు అవసరం
ఏజ్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారిదీ
అదే పరిస్థితి
ఫిల్మ్‌లు లేక కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్న వైనం