
ఇదెక్కడి అన్యాయం?
విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్:
వేట నిషేధ భృతి సకాలంలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఏడాది భృతి ఎగ్గొట్టడం తగదంటూ పలువురు మత్స్యకారుల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. మత్స్యకారులకు అన్యాయం చేయడం తగదన్నారు. 505 మంది అర్హులను అనర్హులుగా ప్రకటించడంపై గగ్గోలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భృతిలో భాగంగా జిల్లాలోని లబ్ధిదారులకు విడుదలైన నిధుల నమూనా చెక్కు ను విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విడుదలచేశారు.
జిల్లాకు చెందిన 3,796 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున రూ.7.59 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, అదితిగజపతి, ఎమ్మెల్సీ రఘురాజు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏడాది భృతి చెల్లించకపోతే ఎలా?
మంత్రిని ప్రశ్నించిన మత్స్యకారులు