
గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు
● మే 9, 10, 11 తేదీల్లో నిర్వహణ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో మే నెల 9, 10, 11 తేదీల్లో కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపి, అసోషియేషన్ ప్రతినిధులు తెలిపారు. గరివిడిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒకప్పుడు గరివిడి ప్రాంతం నాటిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా ఉండేదన్నారు. ఫేకర్ సంస్థ ప్రారంభమైన 1957 నుంచి మంచి నాటిక కార్యక్రమాలు జరిగేవని, తదానంతరం ఈ నాటిక, సాంస్కృతిక పోటీలు కనుమరుగయ్యాయని అన్నారు. గరివిడిలో మళ్లీ సాంస్కృతిక కళారంగ నాటిక పోటీలను ప్రారంభించి ప్రతీ ఏడాది కొనసాగించాలనే ఆలోచనతో గొప్ప ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలి పారు. మూడు రోజుల పాటు ఎనిమిది నాటికలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆహ్వాన నాటిక పోటీలకు సినిమా ప్రముఖులను తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన నాటిక పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు.
నాటికలు ఇవే...
మే 9వ తేదీన హైదరాబాద్‌కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోషియేషన్ వారితో ’స్వేచ్ఛ’, మిత్ర క్రియేషన్స్ వారితో ‘ఇది రహదారి కాదు ’నాటిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 10వ తేదీన గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారితో ‘చిగురు మేఘం’, హైదరాబాద్‌కు చెందిన కళాంజలి వారితో ‘రైతే రాజు’ నాటిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 11వ తేదీన బొరివంకు చెందిన శర్వాని గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం వారితో ‘కొత్త పరిమళం’, కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి వారితో ‘చీకటి పువ్వు’, విశాఖపట్నంకు చెందిన సౌజన్య కళాస్రవంతి వారితో ‘దేవరాగం’ నాటిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.